గ్యాస్ కొరత.. ద్వారకా తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు

by Ramesh Naini |

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలపై పడింది. గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నదానం తయారీ కోసం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు.

గ్యాస్ కొరత.. ద్వారకా తిరుమలలో కట్టెల పొయ్యిపై వంటలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ మేఘాలు సామాన్యులనే కాకుండా ప్రముఖ దేవాలయాలను కూడా తాకాయి. అంతర్జాతీయంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రభావం (ద్వారకా తిరుమల) చినవెంకన్న క్షేత్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కొరతతో ప్రసాదాల తయారీకి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు శనివారం నుండి కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, నిత్యాన్నదాన విభాగంలో రెండు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆలయ ఈవో వై. భద్రాజీ మాట్లాడుతూ.. ‘గ్యాస్ సరఫరాలో జాప్యం కారణంగా ప్రస్తుతానికి రెండు కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేశాం. అవసరాన్ని బట్టి నివేదనశాలలో, ప్రసాదాల తయారీ విభాగంలో మరిన్ని పొయ్యిలు ఏర్పాటు చేస్తాం. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే జిల్లా కలెక్టరును కోరాము.’ అని తెలిపారు.


Next Story