Tirumala:భక్తులకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలు.. ముఠా అరెస్ట్

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-13 13:25:49  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు.

Tirumala:భక్తులకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలు.. ముఠా అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తుంటారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించేందుకు నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) వస్తుంటారు. అయితే తిరుమలలో దొంగల భయం కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఈ తరుణంలో దొంగల నుంచి భక్తులను టీటీడీ(TTD) అధికారులు అప్రమత్తం చేసేందుకు చర్యలు కూడా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు భక్తులు దోపిడీకి గురికావడం జరుగుతుంది. అయితే కొందరు ముఠాగా ఏర్పడి.. భక్తులకు మాయమాటలు చెప్పి దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఇటీవల కూడా మహిళలతో సన్నిహితంగా ఉంటూ నగలు, డబ్బులు దొంగిలించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా తిరుమలలో ఒంటరిగా కనిపించిన భక్తులకు మత్తు మందు ఇచ్చి దొంగతనాలు చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాకు చెందిన శారద(65),విజయకుమార్(33)ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమల వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలలో శ్రీవారి రథం వెనుక భాగంలో గల గేలరీల వద్ద తమిళనాడుకు చెందిన ఒక మహిళను శ్రీవారి దర్శనం చేయిస్తాము అని నమ్మించి తీసుకువచ్చి ఆమెకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి మత్తులో ఉండగా ఆమె బంగారు చైను, చెవి దుద్దులు దోచుకుని వెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల వన్ టౌన్ పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. వాటి ఆధారంగా పై అనుమానితుల గురించి తమిళనాడు రాష్ట్రంలో ముఖ్య పట్టణాలలో విచారణ మొదలుపెట్టారు. పలు పోలీసు స్టేషన్ లో సందర్శించారు క్రైమ్ రికార్డ్ బ్యూరోలను సంప్రదించారు. ఎట్టకేలకు వారిని తిరుమలలో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 21 గ్రాముల బంగారు నగలు, రూ. 45,000/- నగదు, 3 మొబైల్ ఫోన్స్,6 మత్తు మాత్రలు, మారుతి ఆల్టో కార్ ను స్వాధీనపరచుకొని వారిని రిమాండ్ కు పంపారు.

Next Story