ఏపీలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-25 09:08:44  IST  )

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులు, రైతులను బేజారుకు గురిచేస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు.

ఏపీలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరత నెలకొంది. ఏపీలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా కర్నూల్, నంద్యాలలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద టూ వీలర్స్, త్రీ వీలర్స్, కార్లు, లారీలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాయి. రబీ కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ దొరకక రొయ్యలు, చేపల సాగుపై కూడా తీవ్రప్రభావం పడింది. క్రెడిట్ ఆప్షన్ ను రద్దు చేయడంతోనే ఆయిల్ కంపెనీలు బంకులకు ఇంధన సరఫరా తగ్గించడం కారణంగా తెలుస్తోంది.

రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్, సివిల్ సప్లైస్ అధికారుల్ని ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో ఫోనులో మాట్లాడారు. స్టాక్ లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని ఆదేశించారు. పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని.. వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. పెట్రోల్ స్టాక్ సమస్య ఉంటే వెంటనే ఆ బంక్ వారు 1967 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు.

లోక్ భవన్‌కు సీఎం చంద్రబాబు.. గవర్నర్‌కు పరామర్శ

Next Story