ఎర్రచందనం నుంచి భూముల కొల్లీ వరకూ.. మిథున్ రెడ్డి అక్రమాల అరాచకం

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) అధికారంలో ఉన్న సమయంలో విపరీతమైన ప్రాధాన్యం దక్కింది.

ఎర్రచందనం నుంచి భూముల కొల్లీ వరకూ.. మిథున్ రెడ్డి అక్రమాల అరాచకం
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) అధికారంలో ఉన్న సమయంలో విపరీతమైన ప్రాధాన్యం దక్కింది. నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (YS Jagan)తో ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఆధారంగా చేసుకుని వారు పలు వివాదాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మిథున్ రెడ్డి అనుచరుల చేతిలో అక్రమాలు బాగా పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములు, ప్రకృతి వనరులు వారి నియంత్రణలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో మిథున్‌ రెడ్డికి కొందరు స్మగ్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. గంగిరెడ్డి అనే స్మగ్లర్‌ నివాసానికి తరచూ వెళ్లినట్లు కూడా తెలుస్తోంది.

పీలేరు పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆయన అనుచరులకు అప్పగించారని లోకాయుక్త నివేదికలో పేర్కొనబడింది. అంతే కాక రూ.100 కోట్ల విలువైన APIIC భూములను కూడా ఇళ్లపట్టాల పేరిట కేటాయించడం వివాదాస్పదమైంది. మిథున్‌ రెడ్డి కుటుంబానికి డెయిరీ, మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల అవసరాల కోసం పాడి రైతుల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించారని, ఇతర డెయిరీలను బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. రైతులను భయపెట్టి తక్కువ ధరలకే పాలు విక్రయించేందుకు ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

గనుల శాఖ మంత్రిగా ఉన్న తండ్రి ప్రోత్సాహంతో మిథున్‌ రెడ్డి రాష్ట్రంలోని ఇసుక, మద్యం, ఖనిజ వనరులపై ప్రభావాన్ని పెంచుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె ప్రాంతాల్లో రేవుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపులకు సంబంధించి ఆరోపణలు వెలుగుచూశాయి. మంగంపేట బెరైటీస్ గనుల్లో జరుగుతున్న తవ్వకాలపై ఎలాంటి లెక్కలు లేకుండా పని కొనసాగినట్లు చెబుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఉన్న పలు భారీ ప్రాజెక్టుల టెండర్లు మిథున్‌ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కంపెనీకే దక్కినట్టు సమాచారం. మొత్తం రూ.6,000 కోట్ల విలువైన పనులు ఈ సంస్థకు అప్పగించబడ్డాయి. వాటిలో ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి ప్రాంతాల్లో రూ.2,244 కోట్లతో నిర్మిస్తున్న జలాశయాలు ప్రధానవి. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టినందుకు ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించింది.

వైఎస్సార్ కడప జిల్లాలోని కాలేటివాగు ప్రాజెక్టును మధ్యలోనే వదిలేయడం మరో ఉదాహరణ. తిరుపతి విమానాశ్రయంలో 2015లో ఎంపీగా తొలి సారి గెలిచిన తర్వాత మిథున్ రెడ్డి చేసిన హడావుడి కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. అధికారులపై దాడికి పాల్పడిన కేసులో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రంలో కీలకంగా వ్యవహరించినా, తన నియోజకవర్గానికి మిథున్‌ రెడ్డి గణనీయమైన ప్రాజెక్టులను తీసుకురాలేకపోయారని విమర్శలు వినిపిస్తున్నాయి. కడప-బెంగళూరు రైల్వే మార్గాన్ని పులివెందుల మీదుగా మళ్లించేందుకు జరిగిన ప్రయత్నాలను నిలువరించలేకపోయారు. మూడోసారి ఎంపీగా ఎన్నికైనప్పటికీ, రాజంపేటకు ప్రత్యేకమైన అభివృద్ధి తేడాలేదనే విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story