మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత.. మంగళగిరి ఎయిమ్స్‌కు తరలింపు

by Kema Shiva Kumar |

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది.

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి అస్వస్థత.. మంగళగిరి ఎయిమ్స్‌కు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు జెట్ స్పీడ్‌లో కొనసాగుతోంది. మాజీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (A38)పై తీవ్ర ఆరోపణలు ఎదురైన నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు బృందం రెండో చార్జి‌షీట్‌ను కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్‌నాయుడు (A34), పీఏలు బాలాజీ (A35), నవీన్ (A36)లపై అక్రమ ముడుపుల వసూలు, ఎన్నికల ఖర్చులకు డబ్బు పంపిణీలో కీలక పాత్ర పోషించారని సిట్ పేర్కొంది. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ జ్యుడీషియల్ కస్టడీలో విజయవాడ జిల్లాలో జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. తాను పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లుగా జైలు అధికారులకు తెలిపారు. దీంతో ఆయనను సిట్ అధికారులు చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు.

కాగా, వైసీపీ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలకు రూ. 60 నుంచి 70 కోట్లు ముడుపులు కొల్లగొట్టినట్లుగా సిట్ తేల్చింది. ఈ సొమ్ములో రూ.250-300 కోట్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులకు చేశారని పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ ప్రక్రియలో ప్రధాన మధ్యవర్తిగా పనిచేశారని, హైదరాబాద్‌లోని నిహారికా ఇంటర్‌లేక్ అపార్ట్‌మెంట్, మారుటి టవర్స్ వంటి ప్రదేశాల్లో డబ్బు దాచి, రాజ్ కాసిరెడ్డి (A1) ద్వారా తరలించారని అభియోగాలు ఉన్నాయి. ఆయన అనుచరుడు వెంకటేశ్‌నాయుడు డబ్బు లావాదేవీలు చేపట్టారని, హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రూ.35 కోట్లు లెక్కించిన వీడియో సిట్ సంపాదించింది. ముడుపులు డిస్టిలరీ కంపెనీల నుంచి వచ్చాయని, భాస్కర్‌రెడ్డికి పంపారని సిట్ ఆధారాలు చెబుతున్నాయి. భాస్కర్‌రెడ్డి మాజీ గన్‌మెన్ మాదన్‌రెడ్డి, గిరిని విచారించినప్పుడు, తమపై ఒత్తిడి చేసి తప్పుడు సాక్ష్యాలు రుద్దుతున్నారని ఆరోపణలు చేశారు. అయితే, సిట్ ఇవి రాజకీయ కుట్రలని కొట్టిపడేసిన విషయం తెలిసిందే.

Next Story