మరో వివాదంలో బొల్లా బ్రహ్మనాయుడు.. వినుకొండలోనూ కబ్జా ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

మరో వివాదంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిక్కుకున్నారు. హైదరాబాద్ గండిపేటలో భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆయనపై మరిన్నివి సైతం వెలుగులోకి వస్తున్నాయి...

మరో వివాదంలో బొల్లా బ్రహ్మనాయుడు.. వినుకొండలోనూ కబ్జా ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మరో వివాదంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు(Former YSRCP MLA Bolla Brahmanaidu) చిక్కుకున్నారు. హైదరాబాద్ గండిపేటలో భూ కబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఆయనపై మరిన్నివి సైతం వెలుగులోకి వస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండలోనూ ఆయనపై భూ కబ్జా ఆరోపణలు చెలరేగాయి. తమ కంపెనీకి చెందిన భూమిని బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేశారని ఫెడ్రిక్ సంస్థ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి శివారులో 1962లో కొనుగోలు చేసిన రెండెకరాల భూమిని బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేశారని తెలిపారు. అయితే ఈ రెండెకరాల పక్కనే బర్నబాస్ కంపెనీకి నాలుగు ఎకరాల ఉందని, అయితే తమ భూమిని కూడా కబ్జా చేసేందుకు ఆ సంస్థ ప్రయత్నం చేసిందని చెప్పారు. కానీ 2007లోనే ఈ విషయం కోర్టుకెళ్లిందని, మెరేయమ్ కంపెనీకి చెందిన భూమిగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత కూడా పలు ధపాలుగా బర్నబాస్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసిందని 2017లో కూడా మేరేయమ్, ఫెడ్రిక్ కంపెనీలు రెండు హైకోర్టును ఆశ్రయించడంతో భూమిని కాపాడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు.

దీంతో ఆ నాలుగు ఎకరాలను 2020లో బొల్లా బ్రాహ్మనాయుడికి బర్నబాస్ అమ్మకం చేసిందని, అయితే ఆ పక్కనే ఉన్న ఫెడ్రిక్ భూమిని కూడా ఆయన కబ్జా చేశారని స్పష్టం చేశారు. ఈ భూమికి సంబంధించిన వెబ్ ల్యాండ్‌ను కూడా పూర్తిగా బొల్లా బ్రహ్మనాయుడు మార్పుల చేశారని ఫెడ్రిక్ కంపెనీ ప్రతినిధులు ఆరోపించారు. ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెబ్ ల్యాండ్‌లో ఉన్న రికార్డులను పరిశీలించాలని, బర్నబాస్ నాలుగు ఎకరాలతో పాటు, ఫెడ్రిక్‌కు సంబంధించిన రెండెకరాలకు బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమ రెండెకరాల భూమిని కూడా బొల్లా బ్రహ్మనాయుడు మార్చిన రికార్డులను కూడా తమ పేరిట మార్చి తమకు న్యాయం చేయాలని ఫెడ్రిక్ కంపెనీ ప్రతినిధులు కోరారు.

Next Story