- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను ట్యాక్సులు కడుతున్నా.. ఇవిగో లెక్కలు?: బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని, కేవలం తనపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు...

దిశ, వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసిందని, కేవలం తనపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు త్రయం వినుకొండ ప్రాంతాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
హామీలు ఏమయ్యాయి.. బినామీల కోసమేనా?
అధికారంలోకి రాగానే ఎన్‌ఎస్‌పీ పరిధిలో జర్నలిస్టులకు స్థలాలు, ఫ్లాట్లు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఆంజనేయులు, ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. ఎన్‌ఎస్‌పీ స్థలంలో కూరగాయల మార్కెట్, వ్యాపారస్థులకు కేవలం ₹3 లక్షలకే షాపింగ్ కాంప్లెక్స్ ఇస్తామన్న హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాల, రోడ్డు నిర్మాణం, వంద పడకల ఆసుపత్రి వంటి పనులన్నీ గతంలో తానే ప్రారంభించానని, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన ఆ పనులను ఇప్పుడు పూర్తి చేయాలని హితవు పలికారు. పక్కన ఉన్న బినామీల ప్రయోజనాల గురించి కాకుండా, ఊరి అభివృద్ధి గురించి కూటమి నాయకులు ఆలోచించాలన్నారు.
స్వలాభం కోసం చెరువులు ఖాళీ...
ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉందని, నాగార్జున సాగర్ నీరు వస్తుందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి ఉందని బ్రహ్మనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కరువు సమయంలో చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోని నీటిని కేవలం చేపలు పట్టుకోవడానికి, స్వంత లాభాల కోసం మక్కెన మల్లికార్జునరావు ఎల్లబెట్టి (ఖాళీ చేయించి) రుబాబ్ చేస్తున్నారని మండిపడ్డారు. చెరువుల నీరు ఖాళీ చేస్తే భూగర్భ జలాలు పడిపోయి వినుకొండ ప్రాంతంలో ప్రజలు, పశువులు గుక్కెడు నీళ్లు లేక మలమల మాడే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, కలెక్టర్‌కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వినుకొండ నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ బినామీ పేర్లతో ఒకే సొసైటీగా ఫామ్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అగ్రిమెంట్లు రాసివ్వడం చట్టవిరుద్ధమన్నారు.
నేను ట్యాక్సులు కడుతున్నా.. మీ లెక్కలేంటి?
ముల్పూరి అగ్రిటెక్‌కు చెందిన 150 ఎకరాల భూమిని కూటమి నాయకులు కాజేస్తున్నారని, కొండల నుండి మైనింగ్ ట్యాక్స్ కట్టకుండా అక్రమంగా మట్టి తోలుకుంటున్నారని బ్రహ్మనాయుడు ఆరోపించారు. తాను తన పొలాన్ని ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున అధికారికంగా టీడీపీ నేతకే అమ్మానని, దానికి ట్యాక్సులు తానే కడతానని స్పష్టం చేశారు.
2014లో తన డైరీని అమ్మినప్పుడు వచ్చిన కష్టార్జితం నుంచి ప్రభుత్వానికి రూ. 48 కోట్ల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టానని లెక్కలతో సహా బహిర్గతం చేశారు. తన కంపెనీ తరఫున ప్రతి నెలా రూ. 2 కోట్ల జీఎస్‌టీ కడుతున్నట్లు వెల్లడించారు. తనకంటే పది రెట్లు ఆస్తులున్న ఆంజనేయులు, కృష్ణదేవరాయలు ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. గతంలో ఆంజనేయులు తనపై ఈడీ కేసులు పెట్టిస్తే అన్ని లెక్కలు చూపించానని, మళ్లీ ఈడీ, ఐటీ కేసులు పెట్టిస్తామంటే భయపడే ప్రసక్తే లేదని, చావడానికైనా సిద్ధమే తప్ప తలవంచేది లేదని తేల్చి చెప్పారు.
స్వార్థం కోసమే ఎంపీ రాజకీయం
ఎన్నికల సమయంలో పల్నాడు ముఖచిత్రం మార్చేస్తామని, 'వరికుడిశెల' ప్రాజెక్టును తీసుకొస్తామని చెప్పిన ఎంపీ కృష్ణదేవరాయలు ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. దానికి బదులు బనకంచెర్ల ప్రాజెక్టును తీసుకురావడం వల్ల బొల్లాపల్లి మండలంలోని 22 గ్రామాల్లో రైతులు తమ బిడ్డల పెళ్లిళ్ల కోసం పొలం అమ్ముకుందామన్నా కొనే నాథుడు లేకుండా పోయాడన్నారు. కేంద్ర విద్యాలయాన్ని చిలకలూరిపేట, నరసరావుపేటకు తరలించారని ఆరోపించారు. ఎంపీ కృష్ణదేవరాయలు సొంత లాభం కోసం ఎదుటివాడు ఏమైపోయినా పట్టించుకోని రకమని ఎద్దేవా చేశారు.
తాను నిలకడలేని రాజకీయం చేస్తున్నానని విమర్శిస్తున్న నేతలకు బ్రహ్మనాయుడు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చానని, ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక సైలెంట్‌గా ఉన్నానే తప్ప ఏ పార్టీలో చేరలేదన్నారు. ఆ తర్వాతే వైసీపీలో చేరి మూడుసార్లు పోటీ చేశానని వివరించారు. తనను కోస్తే పచ్చ రక్తం వస్తుందని గతంలో ప్రగల్భాలు పలికిన నాయకులే.. ఇప్పుడు కూటమిలో చేరి తనపై బురద జల్లుతున్నారని, ప్రజలంతా ఇవన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబం కష్టపడి పైకొచ్చిందని, ఎవరి ఆస్తులను ఆక్రమించి ఎదగలేదని స్పష్టం చేశారు.






