లిక్కర్ స్కామ్ లేదు.. గిక్కర్ స్కామ్ లేదు.. అంతా కక్షే: అంబటి రాంబాబు

by Vemula.Srinu Prasad |

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రస్తుత పాలన కేవలం రాజకీయ కక్షసాధింపుల కోసమే సాగుతోందని ఆయన మండిపడ్డారు.

లిక్కర్ స్కామ్ లేదు.. గిక్కర్ స్కామ్ లేదు.. అంతా కక్షే: అంబటి రాంబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు(Chandrababunaidu) పాలన రాజకీయ కక్ష సాధింపుల కోసమే సాగుతోందని ఆయన మండిపడ్డారు. ఉనికిలోనే లేని 'లిక్కర్ స్కాం'(Liquor scam)ను సృష్టించి ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. మొదట రూ.30 వేల కోట్ల స్కాం అన్నారని, ఆ తర్వాత రూ.3 వేల కోట్లు అని మాట మార్చారని.. అసలు ఆ అవినీతి ఎక్కడ జరిగిందో కూడా చూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. కేఎన్నార్ నుంచి మొదలుకొని ఆఫీస్ అటెండర్ వరకు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని, రానున్న రోజుల్లో ఫ్లోర్ క్లీనర్లకు కూడా నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

మద్యం విధానంలో మార్పులతో భారీ దోపిడీ

మద్యం విధానంలో మార్పులు తెచ్చి చంద్రబాబు ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని అంబటి రాంబాబు ఆరోపించారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలను, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం సిండికేట్లుగా మారి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, మద్యం షాపుల్లో ఎమ్మార్పీ (MRP) ధరల కంటే భారీగా అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విధంగా ప్రజల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న కోట్ల రూపాయల డబ్బంతా నేరుగా చంద్రబాబు, నారా లోకేష్ జేబుల్లోకే వెళ్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఏరులై పారుతోన్న నకిలీ మద్యం

రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, దీని వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మార్కెట్లో విక్రయిస్తున్న ప్రతి ఐదు బాటిళ్లలో ఒకటి నకిలీ మద్యం సీసా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన నిలదీశారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులతో 'సిట్' (SIT) ఏర్పాటు చేసి, నిజాలను పక్కదారి పట్టిస్తూ అందరినీ బెదిరింపులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి తీవ్రంగా విమర్శించారు.

Next Story