టీడీపీ నేతతో భేటీ.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
టీడీపీ నేతతో భేటీ.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తండ్రి కాలం నుంచి తమ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. చాలా ఏళ్లుగా అమర్నానాథ్ రెడ్డి, తాను రాజకీయాల్లో ప్రత్యర్థులుగానే ఉన్నామని చెప్పారు. వ్యక్తి సంబంధాలు మాత్రం చాలా మంచిగా ఉండేవని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేత అమర్నాథ్ రెడ్డిని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్ రెడ్డి కలిశారు. ఈ సందర్బంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమర్నానాథ్ రెడ్డి, తాను ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పని చేస్తున్నామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని, కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారన్నారు. మోడీ ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రజలు మరోసారి అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రం అడిగిన వెంటనే అమరావతి అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో రూ. 15 వేలు కోట్లు కేటాయించారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రజా అవసరాల కోసం పోలవరాన్ని త్వరగా పూర్తి చేస్తామని కేంద్రం చెప్పిందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వొచ్చని తెలిపారు. గోదావరిలో 10 లక్షల ఎకరాల స్థిరీకరణకు, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. 960 మెగా వాట్ల హైడ్రో ఎలక్ర్టిసిటీకి తోడ్పాటయ్యే ప్రాజెక్టు పోలవరం అని చెప్పారు. 10, 15 పైసలకే యూనిట్ కరెంట్ కొనుగోలు చేయొచ్చని తెలిపారు. త్వరగా హైడ్రో ఎలక్ర్టిసిటీని పూర్తి చేయాలన్నారు. పోలవరం పూర్తి అయితే చాలా ప్రాంతాలను మేలు జరుగుతుందన్నారు. పోలవరం, అమరావతిని చంద్రబాబు వేగంగా పూర్తి చేస్తారని కిరణ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed