‘ఆదాయాల్లేవ్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదే’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-26 07:35:52  IST  )

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ(AP Government) పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS jagan) ఆందోళన వ్యక్తం చేశారు.

‘ఆదాయాల్లేవ్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదే’.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ(AP Government) పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS jagan) ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందని మాజీ సీఎం జగన్ అభిప్రాయపడుతూ సంచలన ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాగ్ గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అనిశ్చితిని స్పష్టంగా సూచిస్తున్నాయని వైఎస్ జగన్ ఆరోపించారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ఆర్థిక నిర్వహణ సవాలుతో కూడుకున్నదని తెలిపారు. కానీ.. సంక్షేమం, అభివృద్ధి అవసరమైన రంగాల్లో సరైన ప్రభుత్వ వ్యయం మాత్రమే ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను, పన్నుయేతర ఆదాయాలు రెండింటిలోనూ ఆర్థిక స్థితి నిరాశాజనకంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆదాయాలలో కొన్ని వర్గాల్లో అతి తక్కువ వృద్ధి, ప్రతికూల వృద్ధి స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఆర్థిక ఉత్సాహం కోల్పోయిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. జీఎస్టీ, అమ్మకపు పన్ను వినియోగాన్ని ప్రతిబింబిస్తాయని కాగ్ విడుదల చేసిన లెక్కల్లో స్పష్టంగా తెలుస్తుందన్నారు.

గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో జీఎస్టీ ఆదాయాలు, అమ్మకపు పన్ను ఆదాయాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ సమయంలో వార్షిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయని, కేంద్రం నుంచి వచ్చే ఆదాయాలతో సహా మొత్తం ఆదాయాలు 6.14శాతం పెరిగాయని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే 15.61 శాతం వేగంతో రుణ పెరుగుదల చోటు చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయాలు కాకుండా ఇతర వనరులపై ఆధారపడుతున్నట్లు ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని మాజీ సీఎం జగన్ సోషల్ మీడియా(Social Media) వేదికగా పేర్కొన్నారు.

Next Story