పెంచడంపై కాదు.. తగ్గించడంపైనే ఫోకస్

by Thanuru Gopichand |   (  Updated:2025-12-31 06:19:42  IST  )

విద్యుత్ చార్జీల తగ్గింపుపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్న ఏపీ ప్రభుత్వం.

పెంచడంపై కాదు.. తగ్గించడంపైనే ఫోకస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని గృహ విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం తియ్యని కబురు చెప్పింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే నూతన ఏడాదిలో ప్రభుత్వం ఫోకస్ విద్యుత్ చార్జీలు పెంచడంపై కాకుండా తగ్గించడంపైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ట్రూడౌన్ చార్జీలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. రానున్న 2026 సంవత్సరంలో చార్జీలు ఇంకా తగ్గించే ప్రయత్నం చేస్తామని ప్రకటించింది.

రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం : మంత్రి గొట్టిపాటి

ఏపీలో విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.6వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) తెలిపారు. నాణ్యమైన విద్యుత్ (Electricity) ఉత్పత్తి చేసి సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకోసం పెద్ద సబ్ స్టేషన్ల నిర్మాణానికి భారీగా నిధులు వెచ్చించనున్నామని అన్నారు. అవసరాలకు తగ్గట్లుగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అంతేకాకుండా కొత్త లైన్లను కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. 2025లో విద్యుత్ చార్జీల తగ్గింపుపైన ప్రత్యేక శ్రద్ధ వహించామని గుర్తించారు. విద్యుత్ చార్జీలు ట్రూడైన్ చేసిన సంవత్సరంగా 2025 నిలిచిందన్నారు. రానున్న 2026లో విద్యుత్ చార్జీలను పెద్ద ఎత్తున తగ్గించే లక్ష్యంతో పని చేస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అందుకోసం వివిధ పథకాలను కూడా అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా సౌర, పవన, బ్యాటరీ, పంప్డ్ స్టోరేజీ రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కృషి చేస్తున్నారని వెల్లడించారు. నూతన ఏడాది నూతనోత్సాహంతో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story