ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్

by Thanuru Gopichand |

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే గెలుపు బాధ్యతలను ఆయా జిల్లా ఇంచార్జి మంత్రులకు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గాల ఆర్డినేటర్లను నియమించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించారు. కాకినాడకు తుమ్మల రామస్వామి, రాజమండ్రికి వై.శ్రీనివాసరావు, అమలాపురానికి బండారు శ్రీనివాసరావు, నరసాపురానికి చన్నమల్ల చంద్రశేఖర్, ఏలూరుకు రెడ్డి అప్పల నాయుడు, విజయవాడకు అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నంకు బండి రామకృష్ణ, గుంటూరుకు నాయబ్ కమల్, నరసరావుపేటకు వడ్రాణం మార్కండేయ బాబును సమన్వయకర్తలుగా నియమించారు. పక్కా ప్రణాళికల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కష్టపడి పనిచేయాలని వారికి పవన్ సూచించారు. ఇక బీజేపీ కూడా తమ వంతుగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఈ నెల 27న ఎన్నిక జరగనుంది. ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25 మంది పోటీ పడుతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా కేఎస్​లక్ష్మణరావు బరిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా కూటమి బలపరిచిన అభ్యర్థిగా పేరాబత్తుని రాజశేఖర్, పీడీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా రాఘవులు ఉన్నారు.

ఈ ఎన్నికను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ఇన్చార్జి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వద్దని హితవు పలికారు. మంత్రి లోకేశ్​కూడా ఇప్పటికే మంత్రులతో మాట్లాడారు. మెగా డీఎస్సీ, ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలను పట్టభద్రులకు వివరించాలని సూచించారు. ఈ క్రమంలో జనసేన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం సమన్వయకర్తలను నియమించింది.

Next Story