విజయవాడ ఎయిర్ పోర్టులో విమాన సేవలు ఆలస్యం

by Thanuru Gopichand |

పొగమంచు కారణంగా ప్రయాణికులు పరేషాన్.

విజయవాడ ఎయిర్ పోర్టులో విమాన సేవలు ఆలస్యం
X

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ (Gannavaram) అంతర్జాతీయ విమానాశ్రయంలో(International Airport) సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు విమాన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. తెల్లవారుజాము నుంచే ఎయిర్‌పోర్టు పరిసరాలను మంచు దుప్పటిలా కమ్మేయడంతో విజిబిలిటీ (Visibility) గణనీయంగా పడిపోయింది. దీనివల్ల రన్‌వేపై విమానాల ల్యాండింగ్‌కు ఆటంకం ఏర్పడటంతో పలు విమాన సర్వీసులు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఉదయం విజయవాడ చేరుకోవాల్సిన ఇండిగో విమాన సర్వీసులు సుమారు గంటకు పైగా ఆలస్యమయ్యాయి. పొగమంచు విడిపోయేవరకు విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యే అవకాశం లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు దేశ రాజధాని దిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం కూడా పొగమంచు కారణంగా గంట ఆలస్యంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. దట్టమైన మంచు ప్రభావంతో ఉదయం 9.55 గంటలకు విశాఖపట్నం నుండి రావాల్సిన ఇండిగో సర్వీసును విమానయాన సంస్థ రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులకు విమాన సంస్థల ప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. శీతాకాలం కావడంతో తరచూ ఏర్పడుతున్న పొగమంచు వల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, ప్రయాణికులు తమ విమాన సమయాలను ముందుగానే సరిచూసుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు.

Next Story