సంక్షోభంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ.. సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ

by Disha Web Desk 21 |
సంక్షోభంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ.. సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో : కరోనా సంక్షోభంతో తీవ్రనష్టాన్ని చవిచూసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమపై సీఎం జగన్ హడావిడి నిర్ణయం తీసుకుని వారిని సంక్షోభంలోకి నెట్టేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ముందస్తు ప్రణాళికలేకుండా హడావిడి నిర్ణయం తీసుకోవడం మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా ఉంది అని విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో కనీసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చెయ్యకుండా విశాఖ వేదికగా జరిగిన సభలో మీరు ప్లాస్టిక్ ఫ్లెక్స్ బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించడంతో, ఈ రంగం పై ఆధారపడిన సుమారు 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అని ఆరోపించారు. ఈ మేరకు నారా లోకేశ్ గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి.. ఎంతమంది ఈ రంగం పై ఆధారపడి ఉన్నారు అనేవి ముందస్తు సమాచారం లేకుండా వారికి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చెయ్యకపోవడం దురదృష్టకరమన్నారు.

ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ నిర్వాహకులతో చర్చించకుండా జి.ఓ. నెం: 65 తీసుకొచ్చి కఠిన ఆంక్షలు, ఫైన్లు విధిస్తూ నవంబర్ 1 నుండే నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నాం అంటూ ఆవేదనతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను కలిసి సమస్యను వివరించినా ఎటువంటి ఫలితం లేదు అని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందంటూ వారి ఆవేదనను తనను కలచివేసిందని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.

పర్యావరణంపై ప్రేమ ఒలకబోయడం ఆశ్చర్యంగా ఉంది

పర్యావరణంపై మీరు ఉన్నట్టుండి ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది అని లోకేశ్ ఎద్దేవా చేశారు. 'ఒక పక్క మీరు ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. విశాఖలో పచ్చని రుషి కొండని బోడి కొండగా మార్చారు. ఫ్లెక్సీ పరిశ్రమ పై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుంది' అని లోకేశ్ చెప్పుకొచ్చారు. 'రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి.

వీరంతా సుమారుగా రూ.10 నుంచి 30 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని కొంతమంది.. అప్పులు చేసి మరికొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారు. నెలవారీ ఈఎంఐ కట్టడమే కష్టం అవుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రస్తుతం ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ ఎదుర్కుంటున్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం వారి సమస్యలు అధ్యయనం చేసేందుకు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చెయ్యాలి అని లోకేశ్ లేఖలో డిమాండ్ చేశారు. 'ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు కోరుతున్న విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు పై అధ్యయనం చెయ్యాలి.

ప్రస్తుతం ఉన్న యూనిట్లను కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి సుమారుగా 15 లక్షల రూపాయిల ఖర్చు అవుతుంది. ఈ మార్పు కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలి. నవంబర్ 1 నుండి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న నిషేధాన్ని కనీసం ఏడాది పాటు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలి. హడావిడి నిర్ణయం, చర్యలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలను అంధకారం చెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలి' అని లోకేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు.


Next Story

Most Viewed