మచ్చలేని చంద్రుడు నా భర్త...దోచుకునే అలవాటు మాకు లేదు: నారా భువనేశ్వరి

by Seetharam |   (  Updated:2023-09-27 11:23:44  IST  )

స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.

మచ్చలేని చంద్రుడు నా భర్త...దోచుకునే అలవాటు మాకు లేదు: నారా భువనేశ్వరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేయలేదని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ప్రజల సొమ్ము దోచుకుని దాచుకునే అలవాటు చంద్రబాబు నాయుడుకు గానీతమ కుటుంబానికి గానీ లేదని భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు నాయుడు తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజల కోసం కష్టపడ్డారే తప్ప ఏనాడు అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. స్కిల్ స్కాం కేసులో సీఐడీ విచారణ చేస్తోందని మరి ఆ విచారణలో చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశారో చెప్పడం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని నారా భువనేశ్వరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. టీడీపీ కుటుంబ పెద్ద అయిన చంద్రబాబును జైల్లో అన్యాయంగా నిర్బంధించారని భువనేశ్వరి అన్నారు. ఏం తప్పు చేశారని చంద్రబాబు నాయుడును నిర్బంధిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు నారా లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు.

ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా..?

స్కిల్ స్కాం కేసులో ఎలాంటి విచారణ లేకుండానే నిర్బంధిస్తారా..? ఆరోపణల్లో వాస్తవాలేంటో తెలుసుకోరా? అని నారా భువనేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి 19 రోజులుగా రాజమండ్రి జైల్లో నిర్బంధించారు అని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మచ్చలేని చంద్రుడు అని అభిప్రాయపడ్డారు. 45 ఏళ్ల నుంచి ప్రజా సేవ కోసమే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నారన్నారు. చంద్రబాబు ఆలోచనలు నిరంతరం ప్రజల కోసమేనని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు చేసిన తప్పా అని నిలదీశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ సెంటర్లలో శిక్షణ పొంది యువత నేడు లక్షలు జీతాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఈ స్కిల్ డవలప్‌మెంట్ ద్వారా దాదాపు 2 లక్షల మందికి చంద్రబాబు బంగారు బాట వేశారని చెప్పుకొచ్చారు. పాడేరు ఏజెన్సీలో కూడా స్కిల్‌డెవలప్‌మెంట్‌లో వేలాది మంది శిక్షణ పొందారని నారా భువనేశ్వరి గుర్తు చేశారు.

మహిళలను వేధిస్తోన్న వైసీపీ

చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని నారా భువనేశ్వరి కొనియాడారు. మహిళలంటే చంద్రబాబుకు నమ్మకమని అందుకే ఎప్పుడు బయటకు రాని మహిళలు సైతం చంద్రబాబు కోసం ఇప్పుడు రోడ్డుపైకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా మహిళలలు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్న పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారా భువనేశ్వరి ఆరోపించారు. సృష్టికి మూలమైన మహిళలపట్ల ఈ వైసీపీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. అంతేకాదు వైసీపీ నేతలు మహిళలను అసభ్యకరంగా దూషిస్తున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. లోకేశ్‌కు సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తోందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువగళం పాదయాత్ర ఆగదని చెప్పుకొచ్చారు. ఇంకోవైపు అన్యాయంగా అక్రమంగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారని భువనేశ్వరి ఆరోపించారు. మాజీ ఎంపీ తోట సీతామహలక్ష్మి ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యానేరం కేసు పెట్టారని ఆరోపించారు. ఇది పోలీసులకు న్యాయంగా ఉందా అని నిలదీశారు. సేవ్ డెమెక్రసీ.. సేవ్ ఆంద్రప్రదేశ్.. సత్యమేవ జయతే అంటూ నారా భువనేశ్వరి నినదించారు.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story