- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్.. పులిహోర తిన్న విద్యార్థులకు అస్వస్థత
ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది.

దిశ, సూళ్లూరుపేట : ఓ అంగన్ వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన తిరుపతి జిల్లాలో కలకలం సృష్టించింది. ఆడుకుంటూ వెళ్లిన విద్యార్థులు అచేతన స్థితిలోకి వెళ్లడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పిల్లలను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లకూరు మండలం, కానూరు దళిత వాడలోని కానూరు అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం 18 మంది పిల్లలు హాజరయ్యారు. మెనూ ప్రకారం పులిహోర అన్నం వడ్డించారు. దానిని తిన్న తర్వాత చిన్నారులు ఇళ్లకు వెళ్లారు. వీరిలో ఐదుగురు చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. గమనించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ నాగరాజు హూటాహుటిన గ్రామానికి చేరుకోని చిన్నారులను నాయుడుపేట సామాజిక వైద్యశాలకు తరలించారు. అస్వస్థత గురైన విద్యార్థులలో గురవయ్య(4) గురువర్షిని (3) నాని(5) జోత్స్న(4) జస్వంత్ (3) ఉన్నారు. వీళ్లకు వైద్యులు చికిత్న అందిస్తున్నారు.
చిన్నారులు అస్వస్థతకు గురి కావడానికి అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన పులిహోరే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీదేవి ఆసుపత్రి వద్దకు చేరుకుని వివరాలను సేకరించారు. అంగన్ వాడీ కేంద్రంలోనూ తనిఖీలు చేశారు. అంగన్ వాడీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, నిన్న వండిన వంటకాలను ఇవాళ వడ్డిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాసిరకమైన ఆహారం వడ్డిస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.






