భోగాపురం గడ్డపై తొలి విమానం ల్యాండింగ్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-04 06:02:48  IST  )

ఉత్తరాంధ్రలో చారిత్రాత్మక ఘట్టం.

భోగాపురం గడ్డపై తొలి విమానం ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ​ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మితమైన భోగాపురం విమానాశ్రయంలో (Bhogapuram Airport) తొలి విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ (Trail Run) విమానం ఆదివారం ఉదయం రన్‌వేపై సురక్షితంగా దిగింది. విమానాశ్రయ సాంకేతిక సామర్థ్యం, రన్‌వే నాణ్యత, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరును పరీక్షించడానికి ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్‌ను నిర్వహించారు. ఈ చారిత్రక క్షణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ ఈ విమానంలో ప్రయాణించి భోగాపురం చేరుకున్నారు.

​అత్యాధునిక టెక్నాలజీ.. తుఫానులను తట్టుకునేలా నిర్మాణం

​ఈ విమానాశ్రయాన్ని అత్యంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. గతంలో విశాఖను వణికించిన హుద్‌హుద్ తుఫాను సమయంలో గాలులు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం విమానాశ్రయ టెర్మినల్, ఇతర భవనాలను గంటకు 280 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రచండ గాలులను కూడా తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించినట్లు జీఎంఆర్ (GMR) సంస్థ తెలిపింది. సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పెద్ద విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే సౌకర్యం ఉందని పేర్కొంది.

​ఆరు నెలల ముందుగానే అందుబాటులోకి..

​వాస్తవానికి ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టాల్సి ఉంది. అయితే పనుల వేగం పెరగడంతో ఆరు నెలల ముందుగానే విమానాశ్రయం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 95 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, జూన్ 2026 నాటికి విమానాశ్రయాన్ని ప్రారంభించి, పూర్తిస్థాయిలో కమర్షియల్ ఆపరేషన్లు మొదలుపెడతామని జీఎంఆర్ ప్రతినిధులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆగస్టు నాటికి పూర్తిస్థాయి ప్యాసింజర్, కార్గో సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఆరంభం నుంచి నేటి వరకు

​భోగాపురం విమానాశ్రయ ప్రతిపాదన 1997లో చంద్రబాబు హయాంలోనే మొదలైనప్పటికీ, 2014 రాష్ట్ర విభజన తర్వాతే దీనికి వేగం పుంజుకుంది.

​2019: ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

​2023: మే నెలలో పనులు అధికారికంగా వేగవంతం అయ్యాయి.

​2024: కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిధుల విడుదల, అనుమతుల ప్రక్రియ శరవేగంగా సాగింది.

​2026 జనవరి 4: ఢిల్లీ నుండి తొలి వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండింగ్‌తో విమానాశ్రయం తన కార్యకలాపాలకు సిద్ధంగా ఉందని చాటిచెప్పింది.

​ఉత్తరాంధ్రకు ఆర్థిక ఊతం

​సుమారు రూ. 4,592 కోట్ల వ్యయంతో, 2,200 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం కేవలం రవాణాకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రకు ఒక ఆర్థిక ఇంజిన్‌లా మారనుంది. విమానాశ్రయం చుట్టుపక్కల ఐటీ పార్కులు, ఏవియేషన్ అకాడమీ, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పాటు కానుండటంతో వేలాది మందికి ఉపాధి లభించడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో విశాఖ, విజయనగరం ప్రాంతాలకు గుర్తింపు రానుంది.

Next Story