వివాహేతర సంబంధం.. పోలీసు స్టేషన్ ఎదుటే దారుణం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-05 04:31:42  IST  )

సమాజంలో దిగజారిపోతున్న విలువలు కుటుంబాల పతనానికి దారి తీస్తున్నాయి.

వివాహేతర సంబంధం.. పోలీసు స్టేషన్ ఎదుటే దారుణం
X

దిశ, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధం (Extra Marital Affair) ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరో కుటుంబంలో చిచ్చు పెట్టింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సభ్య సమాజం తలదించుకునే ఇటువంటి సంఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఈశ్వరప్ప (25) అనే యువకుడు ఓ వివాహితను ప్రేమ పేరుతో నమ్మించాడు. ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. నెల్లూరు జిల్లాలోని గూడూరులో మకాం పెట్టాడు. అయితే వివాహిత కుటుంబ సభ్యులు విషయం తెలుసుకొని ఆందోళనకు గురయ్యారు. తనకల్లు పోలీసులను (Tanakallu Police Station) ఆశ్రయించారు. విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తనకల్లు పోలీసులు వివాహిత భర్త హరిని తమ వెంట బెట్టుకొని గూడూరుకు వెళ్లారు. అక్కడ ఈశ్వరప్పతో పాటు వివాహితను గుర్తించారు. వారిని గూడూరు నుంచి తనకల్లుకు పోలీసుల వాహనంలో తరలించారు. ఈ క్రమంలో వాహనం తనకల్లు పోలీసు స్టేషనుకు చేరుకోగానే వివాహిత కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఈశ్వరప్ప వాహనం నుంచి కిందకు దిగగానే పదునైన వస్తువులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఈశ్వరప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన నుంచి తేరుకున్న పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే పోలీసు స్టేషన్ ఎదుటే హత్య జరగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకల్లు పోలీసుల తీరుపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story