సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారు : టీడీపీ నేతలపై ఆర్కే రోజా ఫైర్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-06 06:22:26  IST  )

వైసీపీ మాజీమంత్రి జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు.

సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారు : టీడీపీ నేతలపై ఆర్కే రోజా ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ మాజీమంత్రి జోగి రమేశ్ ఇంటిపై జరిగిన దాడిని ఆ పార్టీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు పట్టుకుని పబ్లిక్ గా దర్జాగా తిరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన ఇంటిని పరిశీలించారామె. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జోగి రమేశ్, అంబటి రాంబాబు ఇళ్లపై దాడుల వెనుక నారా లోకేశ్, చంద్రబాబు నాయుడు ఉన్నారన్న విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. చేసిందంతా చేసి.. తన నాయకుడిని తిట్టారు కాబట్టే దాడులు చేశామని సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారని ధ్వజమెత్తారు. తమ నేతలను చూసుకునే టీడీపీ శ్రేణులు బరితెగించారని ఆరోపించారు. 18 నెలలుగా జోగి రమేశ్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం సాధిస్తోందన్నారు. గతంలో ఆయనపై, ఆయన కొడుకులు, భార్యపై కూడా కేసులు పెట్టారన్నారు. తిట్టిన ప్రతి ఒక్కరి ఇళ్లపై రాళ్లువేసి, పెట్రోల్ పోసి తగలబెట్టాలంటే.. చంద్రబాబు, బాలకృష్ణలు కూడా ప్రధాని మోదీని ఇష్టానికి తిట్టారని, వారి ఇళ్లను ఏం చేయాలని ప్రశ్నించారు.

క్షమాపణ చెప్పాలని డిమాండ్

తిరుపతి లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పిందని, అయోధ్యకు పంపించిన లడ్డూల్లోనూ నాణ్యమైన నెయ్యినే వాడినట్లు స్పష్టమైందన్నారు. ఈ విషయంలో హిందూ భక్తులను ఆందోళనకు గురిచేసిన చంద్రబాబు నాయుడు.. హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం పర్యటనపై హైటెన్షన్.. పోలీసుల నోటీసులు బేఖాతరు?

Next Story