ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు.. జగన్ ఫైర్

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు.. జగన్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నంచేశారని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైసీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారిందని, పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా ఆ ప్రాంతంలో వైసీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారన్నారు. వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుందని సంబంధిత వీడియో షేర్ చేశారు. సీఎం చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేదని, ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

Next Story