కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-11 06:59:11  IST  )

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంపై సీపీఐ నారాయణ సంతాపం ప్రకటించారు.

కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు (82) తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ లోని స్టార్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్నారు. బుధవారం ఉదయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 1943లో పుట్టిన ఆయన వరంగల్ నిట్ లో డిగ్రీ పొందారు. ఐదుసార్లు ఎంపీగా, ఒక సారి కేంద్ర జౌళిశాఖ మంత్రిగా కావూరి సాంబశివరావు సేవలందించారు. 1984,1989, 1998 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2004, 2009 సంవత్సరాల్లో ఏలూరు లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో జౌళిశాఖ మంత్రిగా సేవలందించారు. మొత్తంగా 8,9,12,14,15 లోక్ సభలకు ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉన్న ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. కాగా.. కావూరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్.. స్వయానా ఈయన కూతురి కొడుకే.

సీపీఐ నారాయణ సంతాపం

కావూరి సాంబశివరావు మరణంపై సీపీఐ జాతీయ నేత నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంటూ ప్రకటన విడుదల చేశారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా, నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన ప్రజా నాయకుడిగా అందరి గౌరవాన్ని సంపాదించారని కొనియాడారు. కావూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, ప్రజా జీవితంలో నిజాయితీ, విలువలతో రాజకీయాలు చేయవచ్చని తన ప్రవర్తనతో నిరూపించిన నాయకుడని కితాబిచ్చారు. ఆయన సేవలు దేశ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కావూరి మరణం రాజకీయాల్లో తీరని లోటుగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన గాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Next Story