- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ
కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్యసేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే విధంగా ప్రవర్తించే వైద్యులు, సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు.

దిశ, డైనమిక్బ్యూరో : కార్మికులకు ఉచితంగా ఉత్తమ వైద్యసేవలు అందజేయాలనే లక్ష్యంతోనే ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అటువంటి లక్ష్యానికి విఘాతం కల్పించే విధంగా ప్రవర్తించే వైద్యులు, సిబ్బందిని ఏమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు.రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని స్వయంగా గమనించిన తదుపరే ఐదుగురు వైద్యులను, నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రి ఈఎస్ఐ వైద్యులు, సిబ్బంది విధుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య ధోరణి వల్ల ఆ ఆసుపత్రిలో ఓపీ గరిష్టంగా 50 కూడా లేదని, అయితే వీరిని సస్పెండ్ చేసిన తదుపరి ఓపీ 170 కి పెరిగిందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న 78 డిస్పెన్సరీలకు అదనంగా మరో 18 డిస్పెన్సరీలను తమ ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుచున్నదన్నారు. అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టే యోచనలో తమ ప్రభుత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన కేవలం తొమ్మిది మాసాల కాలవ్యవధిలోనే అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్ ఆసుపత్రితో పాటు ఈఎస్ఐ మెడికల్ కళాశాలను, 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదనలను ఈఎస్ఐసీ డైరెక్టర్ జనరల్ కు పంపడం జరిగిందన్నారు. తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకల సామర్థ్యానికి పెంచే చర్యలు చేపట్టామన్నారు. తద్వారా 97 రెగ్యులర్ పోస్టులు, 94 అవుట్సోర్సింగ్ పోస్టులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖ ఫార్మాసిటీలో సి.ఎస్.ఆర్. నిధులతో మొబైల్ ఐసీ యూనిట్ ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు.






