ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్

by Gantepaka Srikanth |

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో ఆక్రమణలు చోటు చేసుకున్న మాట వాస్తవం.

ఆక్రమణలు జరిగిన మాట వాస్తవమే: ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ భూములలో ఆక్రమణలు చోటు చేసుకున్న మాట వాస్తవం. ఇందుకు సంబంధించి భారత న్యాయసంహితను అనుసరించి ఏపీ అటవీ చట్టంలోని 61 (2),20 (1)(డి)(2), 52(డి) ప్రకారం కేసులు నమోదు చేశాము. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. ఏ2గా పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఏ3గా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఏ4గా పెద్దిరెడ్డి ఇందిరమ్మ పేర్లు నమోదు చేశాము. అటవీ చట్టం ప్రకారం ప్రిలిమినరీ అఫెన్స్‌ రిపోర్ట్‌ (పీవోఆర్‌) ప్రకారం చార్జిషీటు దాఖలు చేశాం. ఆక్రమణకు గురైన 32.63 ఎకరాల భూమిని స్వాధీనం చేస్తుకున్నాం. కోర్టులో కేసుల వివరాలు దాఖలు చేశామని పీసీసీఎఫ్ (హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.) కార్యాలయం ప్రకటన చేసింది.

1968 గెజిట్ ప్రకారం మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలు ఉన్నాయి. అయితే 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా కలిపేసుకున్నారు. దానికి కంచె వేశారు. ఆ అటవీ భూముల్లో ఉద్యాన పంటలు వేసి సాగు చేసి, ఆదాయం పొందారు. చట్ట విరుద్ధంగా బోర్ వెల్ తవ్వారు. అటవీ వనరులు దుర్వినియోగం చేశారు. దాదాపు రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం వాటిల్లింది. పీ.ఓ.ఆర్.నెం.3/2025 ప్రకారం వీరిపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967, బి.ఎన్.ఎస్. సెక్షన్ల మేరకు కేసులు నమోదు చేసి నోటీసులు ఇవ్వడమైనది. 32.63 ఎకరాలకు చట్టబద్ధమైన పత్రాలను కూడా వారు సమర్పించలేకపోయారు. అటవీ భూములు ఆక్రమించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. అటవీ భూముల అన్యాక్రాంతంపై విచారణకు రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశాము. అన్యాక్రాంతమైన భూంలను తిరిగి స్వాధీనం చేసుకొంటున్నాము. అటవీ భూముల వివరాలను వెబ్ సైట్లో పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ సర్వే మొత్తం పూర్తి చేసి స్థలాల వివరాలను వెబ్ సైట్లో పెడతాం అని పీసీసీఎఫ్((Principal Chief Conservator of Forest) పీవి చలపతిరావు వెల్లడించారు.

Next Story