పిఠాపురంలో కమిటీ వేయమని నేనే అడిగా : SVSN వర్మ భావోద్వేగం

by Naga Rani Yarlagadda |

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

పిఠాపురంలో కమిటీ వేయమని నేనే అడిగా : SVSN వర్మ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, తన రాజకీయ ప్రస్థానం, పార్టీ తీసుకున్న నిర్ణయాలపై వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకానొక దశలో కన్నీళ్లు ఆపుకోలేక, ప్రెస్ మీట్‌ను మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.

పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను శిరసావహించి కట్టుబడి ఉంటానని వర్మ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలోనూ పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని హైకమాండ్ సూచించిందని, అప్పటి నుంచి తాను నిరంతరం పార్టీ బలోపేతం కోసమే శ్రమించానని గుర్తుచేశారు. తాను ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తించానని ఆయన భావోద్వేగంతో వివరించారు. పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పక్షాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని తానే స్వయంగా మంత్రి నారా లోకేష్‌ను కోరినట్లు వర్మ వెల్లడించారు. తనను సంప్రదించిన తర్వాతే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చివరిగా.. పిఠాపురం టీడీపీ శ్రేణులకు ఆయన కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యులందరూ అధిష్టానం జారీ చేసిన ఆదేశాల మేరకు నడుచుకోవాలని, కూటమి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్మ కన్నీటి పర్యంతమవ్వడంతో అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా కొంత ఆవేదనకు లోనయ్యారు. రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయాల్లో వర్మ పాత్ర ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story