నారావారిపల్లెలో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

by Thanuru Gopichand |

ఏ కష్టమొచ్చిందో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

నారావారిపల్లెలో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా (Chittoor) చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెలో (Naravaripalle) సీఎం చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) నివాసం వద్ద కలకలం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం రాజయ్యగారిపల్లి గ్రామానికి చెందిన గోవిందరెడ్డి (65) అనే వృద్ధుడు తెల్లవారుజామునే తనకున్న దీర్ఘకాలిక సమస్యలను సీఎం విన్నవించుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు ఆయనను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన తనకు నిరాశ ఎదురవడంతో గోవింద రెడ్డి మనస్తాపం చెందాడు. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి బాధితుడిని తొలుత నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

​ఈ ఘటనపై బాధితుడితో పాటు వచ్చిన గ్రామస్థుడు రెడ్డప్ప పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు తమ కష్టాలను చెప్పుకోవడానికి వస్తే, పోలీసులు కనీసం వారి మొర ఆలకించకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కేవలం పోలీసులు పంపకపోవడం వల్లే తన స్నేహితుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని వాపోయారు. ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

Next Story