Vizag: స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 8 మంది కార్మికులు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-08 12:47:45  IST  )

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

Vizag: స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 8 మంది కార్మికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం సాయంత్రం సంభవించిన భారీ పేలుడు (Vizag Steel Plant Blast) ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్లాంట్ లో 1500 హీట్ డిగ్రీస్ వేడితో వెళ్తున్న స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ నుంచి కింద పడటంతో ప్రమాదం జరిగింది. SMS -2, STC-3 హీట్ ఎఫ్ జీలో జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు స్పాట్లోనే మరణించారు. మరుగుతున్న ద్రవం నేరుగా కార్మికులపై పడటంతో అక్కడే సజీవ సమాధి అయ్యారు. వేడి వేడి ద్రవం మీద పడటంతో కార్మికులంతా బూడిదయ్యారు. ప్రమాద ఘటనతో మిగతా కార్మికులు, ఉద్యోగులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమీపంలో ఉన్న మరికొందరు కార్మికులకు తీవ్రగాయాలు కావడంతో.. చికిత్స నిమిత్తం సెవెన్ హిల్స్, కిమ్స్ ఆస్పత్రులకు తరలించినట్లు తెలుస్తోంది. మృతుల్లో కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. వారిని గుర్తించేందుకు కొంతసమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు మంటలు ఎగసిపడుతుండగా.. వాటిని అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ప్రమాదం విషయం తెలుసుకున్న ఉద్యోగుల బంధువులు భారీ ఎత్తున స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. తమవారికి ఏమైందోనని ఆర్తనాదాలు పెడుతుండగా.. ఆ ఏరియా మొత్తం విషాదకరంగా మారింది.

Next Story