- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ ఎంట్రీ: దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ముమ్మర సోదాలు
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పోలీసులు (AP Police) నమోదు చేసిన కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు, మనీ లాండరింగ్ కోణంలో దేశవ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాలలో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన వివాదాస్పద డెయిరీ కంపెనీల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు జరుగుతున్నాయి. దిండిగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీస్ ప్రైవేటు లిమిటెడ్, అహల్యా నగర్‌లో ఉన్న మాల్ గంగ మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్, రూర్కిలో ఉన్న బోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కంపెనీల ఆఫీసుల్లో ఈడీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur)తో పాటు దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, రాజ్‌కోట్, డెహ్రాడూన్, రూర్కీ, బికనీర్, అహల్యానగర్, దిండిగల్ ప్రాంతాలలో ఈ రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న పొమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ మన్సుఖ్‌లాల్, అపూర్వ వినయకాంత్, శాంతారామ్‌లకు చెందిన నివాసాలు, వ్యాపార సంస్థల్లో అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఈ సోదాల్లో అధికారులు దాదాపు రూ.60 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. నెయ్యి కల్తీ చేయడం ద్వారా సంపాదించిన దాదాపు రూ.45 కోట్ల మేర సొమ్మును నిందితులు వివిధ స్థిర, చర ఆస్తులపై పెట్టుబడిగా పెట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అందుకు సంబంధించిన పలు కీలకమైన ఆస్తి డాక్యుమెంట్లను, కంపెనీ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ ద్వారా వచ్చిన నల్లధనాన్ని ఎక్కడెక్కడికి మళ్లించారు? ఎవరెవరికి ఇందులో వాటాలు ఉన్నాయి? అనే కోణంలో ఈడీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.






