అమరావతికి ఆర్థిక శోభ: ఆర్బీఐ సహా 25 బ్యాంకుల భవనాలకు నేడు శంకుస్థాపన!

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కీలక అడుగు ఫలిస్తోంది.

అమరావతికి ఆర్థిక శోభ: ఆర్బీఐ సహా 25 బ్యాంకుల భవనాలకు నేడు శంకుస్థాపన!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కీలక అడుగు ఫలిస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రాంతీయ కార్యాలయంతో సహా మొత్తం 25 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల నూతన భవన నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన కేంద్రమంత్రిని గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆత్మీయంగా స్వాగతించారు. అమరావతిలోని తమ నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీసమేతంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం పలికారు.

​25 బ్యాంకుల సముదాయం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆర్బీఐ, ఎస్‌బీఐ (SBI), యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), నాబార్డ్‌తో సహా 25 జాతీయ, ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల శాశ్వత కార్యాలయాల నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెం, నేలపాడు ప్రాంతాల్లో శంకుస్థాపన జరగనుంది. ముఖ్యంగా నేలపాడు వద్ద ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి కేటాయించిన 3 ఎకరాల స్థలంలో కేంద్రమంత్రి భూమిపూజ చేయనున్నారు. ఈ బ్యాంకు భవనాల నిర్మాణానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ. 1000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు స్థానికులకు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా

అమరావతిని ప్రపంచ స్థాయి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు లౌక్యం.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఒకేసారి ఎక్కువ బ్యాంకులను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది. ప్రజల ప్రయోజనాలు.. అమరావతి నిర్మాణమే ప్రధాన ధ్యేయంగా పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. అందుకు ఫలితంగా బ్యాంకుల ఏర్పాటుకు ప్రక్రియ సులభతరం అయ్యింది. ఒకేసారి ఇన్ని బ్యాంకుల కార్యాలయాలు ప్రారంభం కావడం రాజధాని అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో నిలిచిన నిర్మాణాలు

​గతంలో భూ కేటాయింపులు జరిగినా కూడా నిర్మాణాలు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బ్యాంకుల ఏర్పాటు కోసం భవనాల నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ పరిణామం పెట్టుబడిదారులలో కూడా విశ్వాసాన్ని పెంచుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ​రాజధాని ప్రాంత అభివృద్ధికి, ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకోవడానికి ఈ పరిణామం అత్యంత కీలకంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సహా.. మంత్రుల హాజరు

నేడు జరగనున్న ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు సహా కీలక నేతలు హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ అనంతరం సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రితో పాటు వారు ప్రసంగించనున్నారు.

Next Story