- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు.. ఈ సారి ప్రత్యేకత ఇదే!
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ఉంది.

దిశ ప్రతినిధి, గోదావరి జిల్లా: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణను సిద్ధం చేసే పనిలో ఉంది. ఆ దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలో ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 2015లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.
తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష చేశారు. యాత్రికుల బస ఏర్పాట్లతో పాటు మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నిధుల సమీకరణతో పాటుగా గోదావరి తీర ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు






