Pithapuram:ప‌వ‌న్ కళ్యాణ్ అడ్డాలో రేగిన ఇసుక తుఫాన్‌..!

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-07 11:40:04  IST  )

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక తుఫాన్ రేగింది. ఇది కాస్త రాజ‌కీయ తుఫాన్ గా మారిపోతోంది.

Pithapuram:ప‌వ‌న్ కళ్యాణ్ అడ్డాలో రేగిన ఇసుక తుఫాన్‌..!
X

దిశ‌, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక తుఫాన్ రేగింది. ఇది కాస్త రాజ‌కీయ తుఫాన్ గా మారిపోతోంది. ప‌వ‌న్ అడ్డాగా పిలుస్తున్న పిఠాపురంలో ఇసుక మాఫియా వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అడ్డ‌దారుల్లో అక్ర‌మ ఇసుక తవ్వ‌కాల‌కు గేట్లు ఎత్తేశారు. ఇసుక రేణువు కూడా క‌ద‌ల‌నివ్వ‌ను.. స‌హ‌జ సంప‌ద దోచుకునే అవ‌కాశం ఉండ‌ద‌న్న ప‌వ‌న్ మాట‌లు గాలిలో క‌లిసిపోయాయి. ఏకంగా జ‌న‌సేన‌లో ఉన్న వైసీపీ నేత‌లే ఈ అక్ర‌మ త‌వ్వ‌కాల‌కు దారులు తెరిచార‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. దీనిపై కూట‌మి నేత పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ పోరుబాట ప‌ట్టారు. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ద‌ప‌డుతున్నారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఇసుక తుఫాన్ కాస్త రాజ‌కీయ తుఫాన్‌గా మారిపోయింది. జ‌న‌సేన‌కు చెందిన కొంద‌రు నేత‌లు ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాలు చేప‌డుతున్నార‌ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. బొండు ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ఉప్పాడ తీర గ్రామం రావివారిపోడు ప్రాంతాన్ని వ‌ర్మ కార్య‌క‌ర్త‌లు, ఆయా గ్రామాల నేత‌ల‌తో క‌లిసి స్వ‌యంగా ప‌రిశీలించారు. అక్క‌డ పెద్ద పెద్ద బొండు ఇసుక త‌వ్విన గోతులు చూసి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. చెట్టు పుట్టా తెలియ‌కుండా త‌వ్వ‌కుపోతున్న ప‌రిస్థితిని మీడియాకు చూపించారు.

గ‌త వారం రోజులుగా పెద్ద ఎత్తున రాత్రుళ్లు త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అధికారులు ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అస‌లు తాము ప్ర‌భుత్వంలో ఉన్నామా అనే సందేహాన్ని వ‌ర్మ వ్య‌క్తం చేశారు.పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. దీనిపై తాను జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేద‌ని వ‌ర్మ వెల్లడించారు. కూట‌మి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకొచ్చేందుకు కొంత మంది చేస్తున్న ప‌ని అని వ‌ర్మ అన్నారు. దీనిపై ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేస్తున్న‌ట్లు తెలిపారు.

జ‌న‌సేన‌లోకి చేరిన వాళ్ల ప‌నేనా..?

పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు కొత్తేమి కాదు. అయితే గ‌తంలో వైసీపీ వాళ్లు ఇష్టానుసారంగా త‌వ్వుకున్నార‌ని వారిపై తీవ్ర ఆరోపణ‌లు వ‌చ్చాయి. ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ కూడా బొండు ఇసుక త‌వ్వ‌కం దారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, స‌హ‌జ సంప‌ద కాపాడ‌తామ‌ని హామీ ఇచ్చారు. అయితే ఇటీవ‌ల కాలంలో జ‌న‌సేన‌లోకి చేరిన కొంత మంది వైసీపీ నేత‌లు పాతబాట‌లోనే వెళ్ల‌డం దానికి కూట‌మి ప్ర‌భుత్వాన్ని క‌ల‌ప‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీనిపై వ‌ర్మ సైతం జ‌న‌సేన నేత‌ల తీరును ప‌రోక్షంగా త‌ప్పుబ‌ట్టారు. గ‌తంలో త‌వ్వ‌కాలు జ‌రిపిన వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా మ‌ర‌లా త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయంటే ఏలా అర్థం చేసుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

కావాల‌నే చేస్తున్నారా.. ప‌వ‌న్‌కి తెలిసే జ‌రుగుతున్నాయా? అనే అనుమానాల‌ను టిడిపి వ‌ర్మ వ్య‌క్తం చేశారు. అయితే అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌కు అధికారులు ప్రొత్సాహం ఉంద‌నే వార్త‌ల వెనుక ఖ‌చ్చితంగా అధికార పార్టీ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టిడిపి వ‌ర్మ‌కు మాత్రం దీనిని పూర్తిగా వ్య‌తిరేఖిస్తున్నారు. అక్రమ త‌వ్వ‌కాలు జ‌రిగితే ప్ర‌జ‌ల‌తో క‌లిసి పోరాటానికి సిద్ధ‌ప‌డ‌తామ‌ని చెబుతున్నారు. మొత్తంగా ఇక్క‌డ ప‌రిస్థితి చూస్తుంటే..ఇసుక తుఫాన్ కాస్తా రాజ‌కీయ తుఫాన్‌గా మారిపోతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Next Story