District Collector:ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటిస్తే.. రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం

by Jakkula.Mamatha |

వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

District Collector:ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటిస్తే.. రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం
X

దిశ, అమలాపురం: వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలో ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు గోడ పత్రికను ఆయన గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవింగ్ వ్యక్తిగత అనుభవం గా కాకుండా సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. వాహనాలు కండీషన్లో ఉండకపోవడం, అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు.ప్రతి ఏటా నమోదయ్యే మరణాల్లో 40 శాతం రోడ్డు ప్రమాదాలేనన్నారు. వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఎంతో మంది జీవితాలు ప్రమాదంలో పడుతుండగా వాటిలో రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు నివారణ కొరకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించారు.

రహదారి భద్రతా, రోడ్డు భద్రత అనేది సామాజిక సమస్యగా కొనసాగుతోందని,రోడ్డు భద్రతా మాసోత్సవాల నేపథ్యంలో వివిధ రూపాల్లో వాహనదారులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జయప్రదం చేయాలని, సుప్రీంకోర్టు సూచనలు చట్ట ప్రకారం ద్విచక్ర వాహనదారుడు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు. రహదారి ప్రమాదాల్లో కాపాడుకునేందుకు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకొని కుటుంబాలను రక్షించుకోవాలన్నారు. బాధితులు ఎక్కువ శాతం హెల్మెట్ ధరించని వారేనన్నారు.రోడ్డు ప్రమాదాలను అరికట్టడం లో ట్రాఫిక్ నిబంధనలతో పాటు తల్లిదండ్రులు కూడా సామాజిక బాధ్యత వహించాలన్నారు. పలు అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించాలన్నారు.

జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన ప్రభుత్వ సూచనల పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. రోజూ ఉదయం సంతోషంగా ఇంటి నుండి బయటకు వచ్చిన వ్యక్తి, వారి విధులు ముగించుకుని సాయంత్రం తిరిగి అదే సంతోషంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నారు. సంపాదనపరుడూ ఒక రహదారి ప్రమాదంలో మరణించినట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమై నానా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ప్రతి ఒక్కరు కూడా రహదారి నియమాల పై కనీస అవగాహన పెంచుకోవాలన్నారు. రోడ్లు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా వాహన యజమానులు,వాహన డ్రైవర్లు, ప్రజలు. విద్యార్థులకు రహదారి భద్రత, రోడ్ సేఫ్టీ తదితర విషయాలపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో డ్రైవర్లు మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంతో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర, మున్సిపల్ కమిషనర్ రాజు మోటార్ వాహనాల తనిఖీ అధికారులు రవికుమార్, జ్యోతి సురేష్, కాశీ విశ్వేశ్వర రావు, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story