- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాకినాడ జీజీహెచ్‌లో రోగుల ప్రాణాలతో చెలగాటం!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని జీజీహెచ్ (Government General Hospital) లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలోని జీజీహెచ్ (Government General Hospital) లో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్‌లో ప్రాణాంతక రోగాల నిర్ధారణకు ఏకంగా కాలం చెల్లిన (ఎక్స్‌పైర్ అయిన) రియేజంట్లు, టెస్టింగ్ కిట్లను వినియోగిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్క్రబ్ టైఫస్, హెపటైటీస్, కోవిడ్-19 వంటి ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఈ ప్రమాదకరమైన, గడువు ముగిసిన రియేజంట్లను ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాలం చెల్లిన వాటిని వినియోగించడం వల్ల రోగులకు సరైన రోగ నిర్ధారణ జరగక, వారి ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళనలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి.
ల్యాబ్‌లో అవసరమైన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదని, తగిన బిల్లులు లేకుండానే బయటి నుంచి అనధికారికంగా టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక హాస్పిటల్లో పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నాడని తెలుస్తోంది. ల్యాబ్ లో పనిచేసే ఆ ఉద్యోగి పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సదరు ల్యాబ్ లో పనిచేసే ఉద్యోగి సొంతంగా బిల్లులు కూడా తయారు చేసుకుని, నిధులను డ్రా చేసుకుంటున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత కీలకమైన వైరాలజీ ల్యాబ్‌లో జరుగుతున్న ఈ అనైతిక, అక్రమ కార్యకలాపాలపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు, ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సరైన నాణ్యమైన కిట్లు లేకుండా జరిపే నిర్ధారణ పరీక్షలు తప్పుడు ఫలితాలకు దారి తీసి, రోగికి అందాల్సిన సకాలంలో సరైన చికిత్స అందకుండా చేస్తాయనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాల వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటైన కాకినాడ జీజీహెచ్‌లో ఈ తరహా అక్రమాలు వెలుగు చూడటం ఆసుపత్రి నిర్వహణపై, రోగుల భద్రతపై అనేక సందేహాలను తావిస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, ల్యాబ్ కార్యకలాపాలను పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






