రచ్చకెక్కిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బూతుల ఆడియో

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-03-31 07:34:53  IST  )

కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ సచివాలయ ఉద్యోగిని బూతులు తిట్టిన ఆడియో వైరల్ కావడంతో ఇవాళ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

రచ్చకెక్కిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బూతుల ఆడియో
X

దిశ, పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు బూతులు మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగిపై మండిపడ్డ ఫోన్ సంభాషణ కలకలం రేపింది. దీంతో సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సచివాలయ ఉద్యోగులు చుట్టుముట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ కనకారావు పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. తీవ్ర ఎండలోనూ ఉద్యోగులు కూర్చుండిపోయి ఆందోళన చేశారు. చిన్న స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ వ్యవహరించిన తీరు జుగుత్సాపకరంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.నిఖిల్ కృష్ణ మాట్లాడుతూ ఎంతో కష్టపడుతున్న సచివాలయ ఉద్యోగులను కించపరుస్తూ కమిషనర్ వ్యవహరించిన తీరు దారుణమన్నారు. పిఠాపురం మున్సిపాలిటీలో ఎంతోమంది కమిషనర్ బాధితులు ఉన్నారని, వారందరి పట్ల ప్రభుత్వం చొరవ చూపి కమిషనర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ద్వారా అందే పథకాలు, పనులను సక్రమంగా నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులను చాలా చులకన భావంతో చూస్తున్నారని, ఇది సరికాదన్నారు. బూతులు మాట్లాడి ఉద్యోగి మనోభావాలు దెబ్బతీసిన కమిషనర్ కనకారావును విధులు నుండి తప్పించాలని డిమాండ్ చేశారు.

నిరసన కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షుడు మహబూబ్ బాషా, సలాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ తిట్టిన ఉద్యోగి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో, ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి. కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి.

అసలు ఏం జరిగిందంటే..

పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామ కనకరావు పట్టణంలోని 10వ సచివాలయం శానిటరీ కార్యదర్శిగా పనిచేస్తున్న గుమ్మడి సుధీర్‌ను, వార్డులో చెప్పిన పని చేయలేదని ఫోన్లో తీవ్ర అసభ్య పదజాలంతో తిట్టారు. అనరాని మాటలతో కమిషనర్ చేసిన నిర్వాకం ఆడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. కింద స్థాయి ఉద్యోగుల పట్ల కమిషనర్ తీరు సరిగా లేదని ఉద్యోగులు నిరసన బాట పట్టారు.

Next Story