- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాపులకు సీఎం పదవి ఇచ్చే దమ్ము, ధైర్యం వైసీపీకి ఉందా?: కాకినాడ ఎంపీ
కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వైసీపీ కాపు నాయకుల ప్రయత్నాలను ఇకపై సహించబోమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. ...

దిశ, కాకినాడ: కాపు సామాజిక వర్గం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే వైసీపీ కాపు నాయకుల ప్రయత్నాలను ఇకపై సహించబోమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై వైసీపీకి చెందిన కొందరు కాపు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని విమర్శించారు.
వైసీపీ కాపు నాయకులు నిజంగా కాపు సామాజిక వర్గం అభ్యున్నతిని కోరుకుంటే, వచ్చే ఎన్నికల్లో కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే ధైర్యం ఉందా అని ఎంపీ సవాల్ విసిరారు. కాపులపై ముసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నాయకులు ముందుగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి కాపు సామాజిక వర్గానికి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేయాలని సూచించారు. అలా అడిగే ధైర్యం కూడా వాళ్ళకి లేదని, అడిగిన మరుక్షణం సో కాల్డ్ కాపు నాయకులను కుక్కల దొడ్డిలో కట్టి వేయకపోతే తన పేరును మార్చుకుంటానని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సవాల్ విసిరారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రంలో "రెడ్ల రాజ్యం" నడిచిందని, ఎన్నికల సమయంలో "నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు" అంటూ గుండెలు బాదుకున్న జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు, అధికార స్థానాలు మాత్రం తన సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టారని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఏద్దేవా చేశారు. సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మోసం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు కాపుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కాపులదే సీఎం పీఠం అని, కాపు సమాజానికి రాజకీయంగా సముచిత గుర్తింపు, గౌరవం కల్పించే పార్టీ జనసేన మాత్రమేనని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారని, అలాంటి కుట్రలను సహించేది లేదని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని వర్గాలు కలిసిమెలిసి అభివృద్ధి చెందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చే నాయకత్వానికే మద్దతు ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే వైసీపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెచ్చరించారు.






