- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మట్టితో కాసుల వేట!
మితిమీరిన వేగంతో అడ్డూ అదుపు లేకుండా మట్టి మాఫియా నేతలు అడ్డగోలుగా మట్టి తరలింపులకు పాల్పడుతున్నారు.

దిశ, అల్లవరం : మితిమీరిన వేగంతో అడ్డూ అదుపు లేకుండా మట్టి మాఫియా నేతలు అడ్డగోలుగా మట్టి తరలింపులకు పాల్పడుతున్నారు. రోడ్డుపై వెళ్తున్న సామాన్య ప్రజలు మాత్రం వీరి చర్యలకు బెంబేలెత్తిపోతున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం కేంద్రంగా శివారు ప్రాంతాల నుంచి ప్రధాన రోడ్డు మీదుగా ఈ అక్రమ తరలింపులు సాగుతున్నాయి. మరో పక్క తుమ్మలపల్లి కేంద్రంగా ఆక్వా చెరువులు తవ్వి మట్టిని తరలిస్తున్నారు.. ఈ అక్రమ చర్యలను అధికారులెవ్వరూ పట్టించుకోకుంటే ఈ మట్టి దందా వేసవి కాలం అంతా నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, వందల సంఖ్యలో ట్రిప్పులు చందంగా విచ్చలవిడిగా సాగే అవకాశం లేకపోలేదంటున్నారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి గ్రామాలలో గత వారం రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. వీటిలో దేనికి ప్రభుత్వ అనుమతులు లేకపోగా పట్టపగలే జరుగుతోన్న ఈ అక్రమ తంతుకు ఎవ్వరూ అడ్డుకునే సాహసం చేయడంలేదు. కళ్లముందే ఈ అక్రమ దందా జరుగుతోన్న అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కనిపించడంలేదు. దీంతో వీరి అక్రమ చర్యలు హద్దుమీరి విచ్చలవిడితనంతో చెలరేగిపోయేలా మారుతున్నాయి. పట్టపగలే రోడ్డుమీద స్కూల్ పిల్లలు తిరిగే సమయంలో ఈ మితిమీరిన వేగతంతో ఈపనులేంటని ప్రశ్నిస్తే వారిపై కూడా రుబాబు చేసే స్థాయిలో కొంత మంది ట్రాక్టర్ యజమానులు ప్రవర్తిస్తున్నారని, వీరిపై అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
ఫిట్‌నెస్ లేని ట్రాక్టర్లతో ప్రజల బేజారు..
మట్టి అక్రమ తరలింపులకు పాల్పడుతోన్న వాహనాలకు సంబంధించి చాలా వాటికి సరైన పత్రాలు ఉండవంటున్నారు. సరైన ఫిట్నెస్ లేకుండానే రోడ్లపై కాలం చెల్లిన ట్రక్కులతో బరితెగించి మితిమీరిన వేగంతో తిప్పుతుండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ట్రాక్టర్ల వేగానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జరగరాని ప్రమాదం జరక్కుండా ముందస్తుగానే దీనిపై దృష్టిపెట్టాలని పోలీసు, రవాణాశాఖ అధికారులను ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు గ్రామాల్లోనూ ఇదే తంతు..
అల్లవరం మండల పరిధిలోని కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు జోరు ఏమాత్రం తగ్గడం లేదు.. తుమ్మలపల్లి గ్రామ పరిధిలో ఆక్వా చెరువులను తవ్వి కొమరగిరిపట్నం వైపుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.. మరోపక్క కొమరగిరిపట్నం శివారు ప్రాంతాల్లో అక్రమ మట్టిగా అవకాశాలు జరిపి తుమ్మలపల్లి, బెండమూర్లంక గ్రామాలకు తరలిస్తున్నారు.. తుమ్మలపల్లిలో ట్రాక్టర్లు చేస్తున్న విధ్వంసానికి ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ వడ్డి ఎలీషా రాజు సోమవారం అల్లవరం తహసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు.. విచ్చలవిడిగా అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులతో కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, ట్రాక్టర్ యజమానుల అరాచకలను అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు..
కఠిన చర్యలు తీసుకుంటున్నాం..
కొమరగిరిపట్నం, తుమ్మలపల్లి గ్రామాల కేంద్రంగా మట్టి అక్రమ తరలింపులపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఇప్పటికే మైనింగ్ అధికారులతో కలిసి కఠిన చర్యలు చేపట్టాం.. ప్రస్తుతం మట్టి తరలింపులపై కూడా మైనింగ్ అధికారులు, స్థానిక పోలీసులుల సహకారంతో చర్యలు తీసుకుంటాం.. మితిమీరిన వేగంతో తిరుగుతోన్న వాహనాలపై చర్యలకు అవసరమైతే రవాణా శాఖ అధికారులతో చర్చిస్తాం..
- ఎన్వీ నరసింహారావు, తహసీల్దార్, అల్లవరం.






