‘ఫటాఫట్‌.. పెన్సిల్‌ ఆర్ట్‌’.. ఆ అమ్మాయి టాలెంట్‌కు హట్సాఫ్!

by Jakkula Mamatha |
‘ఫటాఫట్‌.. పెన్సిల్‌ ఆర్ట్‌’.. ఆ అమ్మాయి టాలెంట్‌కు హట్సాఫ్!
X

దిశ, అల్లవరం: వారింటికి వచ్చిన ఓ పెద్దమనిషి తల్లితండ్రులతో మాట్లాడుతున్నారు. ఆయన తిరిగి వెళ్తున్న క్రమంలో ఆయనకు అనుకోని బహుమతి అందించింది వారి కుమార్తె. తన ప్రతిరూపం పెన్సిల్‌ ఆర్ట్‌ రూపంలో చూసుకునేసరికి ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ అమ్మాయిని మనసారా అభినందించారు. ఆ పెద్దమనిషి పేరే కాపు ఉద్యమ నాయకుడు, జనసేన నేత కల్వకొలను తాతాజీ.. ఆయన చిత్రాన్ని క్షణాల్లో గీసి బహుమతిగా ఇచ్చిన అమ్మాయే అమలాపురం కల్వకొలను వీధికి చెందిన గోకరకొండ వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మిల కుమార్తె నవ్య శ్రీ సత్య గోకరకొండ. ప్రస్తుతం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఈ అమ్మాయి ఎవ్వరి ప్రతిరూపాన్ని అయినా ఫ్రింటర్‌తో పోటీపడుతుందా అన్నట్టుగా అచ్చుగుద్దినట్లు అంతే వేగంగా పెన్సిల్‌తో గీయగలదు. తాను గీసిన ఎన్నో చిత్రాలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రాం వేదికగా కూడా ఆదరణ పొందుతున్నాయి. ప్రముఖుల నుంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.

ఫ్రీహ్యాండ్‌ స్కెచ్‌ పద్దతిలో చకచకా..

నవ్య శ్రీ సత్య గీసిన ఎన్నో చిత్రాలు అనేక మంది ప్రసంశలు అందించేలా ఆకట్టుకున్నాయి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, తాను చదువుకుంటున్న కాలేజీ వ్యవస్థాపకుడు, ప్రస్తుత రాష్ట్ర మున్సిపల్‌శాఖ మినిస్టర్‌ నారాయణ, గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌, ఐకానిక్‌స్టార్‌ అల్లు అర్జున్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త నందెపు వెంకటేశ్వరరావు దంపతులు ఇలా ఒక్కటేమిటి వందల సంఖ్యలో చిత్రాలను చకచకా గీసి అనేక అభినందనలు అందుకుంది.. ఏ చిత్రమైనా కొన్ని క్షణాల వ్యవధిలో గీయగలగడం నవ్య శ్రీ ప్రత్యేకత కాగా కేవలం కళ్ళతో చూసి ఆ ప్రతిరూపాన్ని వేగంగా గీయగలగడం నవ్యశ్రీ టాలెంట్‌కు నిదర్శనం.

సోషల్‌మీడియాలో వైరల్‌..

నవ్యశ్రీ సత్య గీసిన చాలా చిత్రాలు సోషల్‌మీడియా వేదికగా చక్కర్లు కొడ్తుంటాయి.. తాను పెన్సిల్‌ ఆర్ట్‌ వేస్తున్న వీడియోలు టైమ్స్‌లాప్స్‌లో రికార్డు చేసి తన ఇన్‌స్టా పేజీల్లో పోస్టు చేస్తుంటుంది నవ్యశ్రీ సత్య.. సత్యకు వేల సంఖ్యలో ఫాలోవర్స్‌ ఉండగా అటు నెటిజన్లు నుంచి ఇటు ప్రముఖుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకుంటుంది.



Next Story

Most Viewed