రూ.20 కోట్లకు టోకరా.. లబోదిబోమంటున్న డిపాజిట్‌దారులు

by Jakkula.Mamatha |

కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్య సూర్య బ్యాంకర్స్ రూ.20 కోట్లకు టోకరా పెట్టింది. సంస్థ యజమాని గుట్టు చప్పుడు కాకుండా నగదు, నగలతో ఉడాయించాడు.

రూ.20 కోట్లకు టోకరా.. లబోదిబోమంటున్న డిపాజిట్‌దారులు
X

దిశ, కొత్తపేట: కోనసీమ జిల్లా కొత్తపేటలో సత్య సూర్య బ్యాంకర్స్ రూ.20 కోట్లకు టోకరా పెట్టింది. సంస్థ యజమాని గుట్టు చప్పుడు కాకుండా నగదు, నగలతో ఉడాయించాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిపాజిట్లు నగలు తాకట్టు పెట్టిన వినియోగదారులు లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళపు రాము, ఆయనతో పాటు కూర్మదాసు హేమంత్ వాటాదారులుగా సంస్థను ప్రారంభించారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు డిపాజిట్లతో పాటు నగలను తాకట్టు పెట్టారు. నాలుగు రోజుల క్రితం కూర్మదాసు హేమంత్ కుటుంబ సభ్యులతో కుంభమేళాకు వెళ్లాడనే ప్రచారం జరిగింది. అయితే హేమంత్ ఫోను స్విచ్ ఆఫ్ చేయడం అతనికి సంబంధించిన ఆస్తులను అమ్మి వేయడం వంటి విషయాలు తెలుసుకున్న వినియోగదారులు మరో పార్టనర్ రామును నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

మరో పార్ట్నర్ అయిన శ్రీకాకుళం రాము అనే వ్యక్తి తాను వ్యాపారం నుంచి తప్పుకున్నానని, రెండు సంవత్సరాల క్రితమే తమ సంస్థ లైసెన్స్ రెన్యువల్ ముగిసిపోయిందని తెలిపటంతో బాధితులు అవాక్కయ్యారు.రాము బాధితులతో పాటు పోలీసులకు విషయాన్ని చెప్పాడు. దీంతో పోలీసులు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రెండు సంవత్సరాల నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచడంతో శ్రీకాకుళపు రాము పై కూడా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.నగలు, డబ్బు తో హేమంత్ పరారయ్యారు. ఈ విషయాన్ని తెలపకుండా, తనకు ఈ స్కామ్ కు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తు న్నాడని బాధితులు పేర్కొన్నారు. హేమంత్ తీసుకెళ్లిన నగలు, నగదు మొత్తం విలువ సుమారు రూ.10 కోట్ల వరకు ఉంటుందని పలువురు అంటున్నారు.

రియల్ ఎస్టేట్లో నష్టం వల్లే పరారయ్యాడా..

సత్య సూర్య బ్యాంకర్స్ పేరుతో వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న హేమంత్ రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడని తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బంధువులు, స్నేహితుల నుంచి కూడా 10 కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లుగా పలువురు అంటున్నారు. మరో పార్ట్నర్ తో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన హేమంత్ కు నష్టాలు రావటంతో డబ్బు నగలతో ఉడాయించాడని అంటున్నారు.హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు సోమవారం సత్య సూర్య బ్యాంకు ను ఓపెన్ చేయనున్నారు. బ్యాంకు ను ఓపెన్ చేస్తే అసలు నగదు, నగలు ఎంత మేర ఉన్నాయో అనే వివరాలు తెలుస్తాయి.

Next Story