- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
District Collector:బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. పిల్లలకు బాగా ఉడికిన కోడిగుడ్లు అందించేలా చర్యలు తీసుకోండి!

దిశ, అమలాపురం: జిల్లాలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవ్వలేదని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. శనివారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో బర్డ్ ఫ్లూ మీద కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్షించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీ ఫార్మ్స్‌లో 32 లక్షల కోళ్లు, బ్యాక్యార్డ్ పౌల్ట్రీలో 24 లక్షల కోళ్లు ఉన్నాయని.. వీటిలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించలేదని పశుసంవర్ధక శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు.
చుట్టుపక్కల జిల్లాల్లో కూడా బర్డ్ ఫ్లూ కేసులు స్టెబిలైజర్ అయ్యాయని.. జిల్లాలో 41 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పౌల్ట్రీ యజమానులు బర్డ్ ఫ్లూ కేసులను ఏమైనా దాచి పెడుతున్నారా..? ఇతర రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల జిల్లాల నుంచి కోళ్లు సరఫరా అవుతున్నాయా? అని అధికారులను కలెక్టర్ ఆరా తీశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంతవరకు ఎటువంటి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కానందున .. చుట్టుపక్కల జిల్లాలో కూడా కేసులు స్టెబిలైజ్ అవుతున్న నేపథ్యంలో.. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో తిరిగి కోడిగుడ్లను పిల్లలకు అందించాలని ఆదేశించారు. కోడిగుడ్లను బాగా ఉడికించి మాత్రమే పిల్లలకు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
గత కొన్ని రోజులుగా బర్డ్ ఫ్లూ కారణంగా జిల్లాలో 10 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కోళ్ల ఉత్పత్తులను జిల్లాలోకి రావడంపై ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కేసులు స్టెబిలైజ్ అయిన నేపథ్యంలో ఆరోగ్యవంతమైన కోళ్లను జిల్లాలోకి అనుమతించాలని అధికారులను ఆదేశించారు. కోడిగుడ్లు, మాంసం విక్రయదారుల మీద కూడా ఎటువంటి ఆంక్షలు విధించవద్దని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.