- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: పిల్లల పాలిట శాపంగా వేసవి సెలవులు...?
వేసవి సెలవులే పిల్లల పాలిట శాపంగా మారాయా.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చాయా.. అంటే అవుననే పరిస్థితి కొన్ని రోజులుగా చూస్తే అనిపిస్తోంది....

దిశ, అల్లవరం : వేసవి సెలవులే పిల్లల పాలిట శాపంగా మారాయా.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చాయా.. అంటే అవుననే పరిస్థితి కొన్ని రోజులుగా చూస్తే అనిపిస్తోంది. ఇటీవల అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనల్లో 19 ఏళ్ల లోపు యువకులే. గోదావరి నదీపాయల్లో మృత్యువాతపడి అయినవారి కన్నీళ్లకు కారణం అయితే మరికొన్ని చోట్ల కారులోపల చిక్కుకుని కొంత మంది పిల్లలు మరణించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ దుర్ఘటనల నుంచి పిల్లల్ని అవగాహన కల్పించడంతోనే కొంతవరకైనా ప్రమాదాల నుంచి బయటపడేయగలమని నిపుణులు చెబుతున్నారు..
గోదావరి పాయల్లో మరణ ఘోష..
వేసవి సెలవులకు ఊళ్లకు వచ్చే పిల్లలకు, యువకులకు గోదావరి అందాలంటే అత్యంత ఇష్టం.. సరదాగా ఈతకొట్టాలనో లేక ఇసుక తిన్నెల్లో ఆడుకోవాలనో తెగ ఆతృతపడుతుంటారు.. స్నేహితులతో కలిసి గోదావరి నదీపాయల్లో వెళ్లే ఈ సరదానే వారి ప్రాణాలను తీసింది.. ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గౌతమీ నదీపాయలో జరిగిన దుర్ఘటన ఎంతో భవిత ఉన్న ఎనిమిది మందిని పొట్టపపెట్టుకుంది.. ఇంతలోనే పి.గన్నవరం మండల పరిధిలోని రామారాజులంక వద్ద వశిష్ట నదీపాయలో ముగ్గురు బాలలను కన్నవారికి దూరం చేసింది.. అయితే వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు.. అసలు ఏం చేస్తున్నారు.. అన్నదానిపై తల్లితండ్రులు ఖచ్చితంగా దృష్టిసారించాలంటున్నారు మానసిక నిపుణులు.. అక్కడ ఈప్రమాదం ఉంది.. ఈ అందం వెనుక అఘాధం ఉంటుంది.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాల నుంచి చాలా వరకు బయటపడగలుగుతారని చెబుతున్నారు.
కారులో చిక్కుకుని మృత్యువాత..
రామచంద్రపురం మండలంలో కొన్ని నెలల క్రితం ఇంటి ఆరుబయట దొంగ పోలీస్ ఆట ఆడుతూ ఓ బాలిక కారులో దాక్కుంది.. కారు డోర్ తీసుకుని లోనికి వెళ్లడం అయితే వెళ్లింది కానీ కారు డోర్ ఎలా తీయాలో తెలియక ఊపిరి ఆడక మృతిచెందింది.. ఇటీవల కాలంలో ఈ తరహా దుర్ఘటనలో చాలానే జరిగాయి.. అందుకే కారు వాడుతున్న వారు బాధ్యతగా ఖచ్చితంగా కారు డోర్ లాక్ వేశామా లేదా అన్నది చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో కారు డోర్లు లాక్ పడకపోతే ఎవరైనా పిల్లలు సరదాగా లోనికి వెళ్లి డోర్ వేసుకునే అవకాశం ఉంది.. అందుకే ఈవిషయంలో చాలా బాద్యతగా వ్యవహరించాలంటున్నారు. అంతే కాదు కారు వినియోగిస్తున్న వారు తమ పిల్లలకు ఒక వేళ లోపల ఉండగా డోర్ లాక్ పడితే ఎలా బయటపడాలో తప్పక చెప్పి వారికి అవగాహన కల్పించాలని, నేర్పించాలని సూచిస్తున్నారు.
ఏది ప్రమాదమో చెప్పకనే చెప్పాలి..
చాలా మంది పిల్లలు కొత్త విషయాలు తెలుసుకునేందుకు చాలా ఆసక్తిని కనబరుస్తారు.. కరెంటుతో ప్రయోగాలు చేయడం, నాణేలుతో ఆటలాడడం, ఆడుకుంటూ పొదల్లో దాక్కోవడం, అపార్ట్‌మెంట్ బాల్కనీల్లో ఫీట్లు చేయడం ఇలా చాలా విషయాల్లో పిల్లలు అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు.. అందుకే వారికి ఏది ప్రమాదమో.. దేని వల్ల వారి ప్రాణానికి ముప్పు తెస్తుందో తప్పకుండా అవగాహన కల్పించాలంటున్నారు.. పిల్లలకు కొన్ని సంఘటనలకు సంబంధించి ఉదాహరణలుగా చూపిస్తూ అవగాహన కల్పించాలే కానీ పిరికిమందు వేయకూడదంటున్నారు మానసిక నిపుణులు.. దీని వల్ల భయం ఆవహించే ప్రమాదం కూడా లేకపోలేదని, అందుకే ఏది ప్రమాదమో వివరించి చెప్పగలగాలంటున్నారు.
అవగాహనతో జయించవచ్చు...
వేసవికాలంలో పిల్లల తీరును తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా గమనించాలి.. ఏది ప్రమాదమో వివరించాలి కానీ పిరికిమందు వేయకూడదు.. కేవలం అవగాహనతోనే పిల్లల్ని ప్రమాదాలనుంచి బయటపడేలా చేయగలం.. ఎందుకంటే తెలుసుకోవాలన్న కుతూహలం ఉండడం, ఏది ప్రమాదమో తెలియని దుడుకుతనం వల్ల ప్రాణాలమీదకు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది.. అందుకే తల్లితండ్రులు అవగాహన కల్పించాలి..
-- డాక్టర్ శ్రీపాద రామకృష్ణ (వ్యక్తిత్వ వికాస నిపుణుడు, అమలాపురం)






