పిఠాపురంలో మరో కీలక ముందడుగు

by Vemula.Srinu Prasad |

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది...

పిఠాపురంలో మరో కీలక ముందడుగు
X

దిశ, కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటి) కేంద్రాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేసింది. పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం ఏర్పాటుకు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ చేపట్టిన నిరంతర ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకున్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఇటీవల కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించడంతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి కేంద్ర దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రతిపాదనలు అందిన వెంటనే తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గత నెలలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా కలిసి పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో మాత్రమే ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే పిఠాపురం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కృషితో ఇప్పటికే ప్రతిష్టాత్మక కేంద్ర విద్యా సంస్థలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో, తగిన మౌలిక సదుపాయాలు,అనుకూల వాతావరణం ఉన్నందున పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కాకినాడ జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువతకు సాంకేతిక విద్య, డిజిటల్ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించే అవకాశం ఉందని ఎంపీ వివరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ అధికారులు పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం ఏర్పాటు అవసరాన్ని సమగ్రంగా పరిశీలించి, ఈ నెల 5వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు లేఖ పంపారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, పిఠాపురంలో ఎన్ఐఈఎల్ఐటి కేంద్రం స్థాపనకు కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన ఆమోదం తెలిపి అవసరమైన నిధులు మంజూరు చేసేలా మరోసారి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుతో యువతకు అత్యాధునిక సాంకేతిక విద్య, నైపుణ్య శిక్షణ, పరిశోధన అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story