ఎవరో తూర్పు దిశగా తీసుకెళ్లారు! చిన్నారి జాను ఇంటి వద్ద ఇంకో జ్యోతిష్యుడు హల్చల్

by Ramesh Naini |

కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది.

ఎవరో తూర్పు దిశగా తీసుకెళ్లారు! చిన్నారి జాను ఇంటి వద్ద ఇంకో జ్యోతిష్యుడు హల్చల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా తుని రూరల్ మండలం సీహెచ్ అగ్రహారం ప్రాంతంలో అదృశ్యమైన రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. జూన్ 6న ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన పాప ఆచూకీ 20 రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు. ఒకవైపు పాప ఏమైందోనని కుటుంబం తల్లడిల్లుతుంటే.. మరోవైపు జ్యోతిష్యుల పేరుతో కొందరు చేస్తున్న వింత చేష్టలు వారిని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

జ్యోతిష్యుల వింత చేష్టలు..

తాజాగా పాప ఇంటి వద్దకు వచ్చిన మరో జ్యోతిష్యుడు హల్చల్ చేశాడు. చిన్నారిని ఎవరో తూర్పు దిశగా తీసుకెళ్లారని, ప్రస్తుతం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, జూలై-సెప్టెంబర్ నెలల మధ్య పాప తిరిగి వస్తుందని జోస్యం చెప్పాడు. అయితే, ఇలాంటి ఘటనలు జరగడం ఇది తొలిసారి కాదు. గతంలో తెలంగాణ నుంచి వచ్చిన ఓ జ్యోతిష్యుడు సైతం ఆ కుటుంబాన్ని తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాడు. పాప భూదేవిలో కలిసిపోయిందని, తాను పూజలు చేస్తే నడుచుకుంటూ వస్తుందని చెప్పి.. అర్ధరాత్రి వారి ఇంటి పైకి ఎక్కి పడుకున్నాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న సమయంలో అతడి చేష్టలతో తాము తీవ్రంగా భయపడిపోయినట్లు చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

కిడ్నాప్ కోణంలో దర్యాప్తు

గత కొన్ని రోజులుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీశాఖ బృందాలు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్ సాయంతో కాలువలు, అటవీ, కొండ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ చిన్నారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో చిన్నారి కిడ్నాప్‌కు గురై ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story