489 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఆమోదం

by Bhoopathi Nagaiah |

కాకినాడ జిల్లా జర్నలిస్టులకు కలెక్టర్ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేశారు. రెండు విడతల్లో కలిపి 489 మందికి ఈ కార్డులను అందించనున్నారు.

489 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఆమోదం
X

దిశ, కాకినాడ: జిల్లాలోని కొంత మంది జర్నలిస్టులు అన్నవరం దేవస్థానం, సంక్షేమ హాస్టళ్ల అధికారులను ఫోన్ చేసి ప్రతికూల వార్తలు రాస్తామని బెదిరింపులకు పాల్పడినట్టు తన దృష్టికి వచ్చిందని, ఒకవేళ అక్రమాలు, తప్పులు జరిగి ఉంటే వార్తలు ప్రచురించాలే తప్ప, బెదిరింపులకు పాల్పడకూడదని కలెక్టర్ షణ్మోహన్ సగిలి హితవు పలికారు. అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్న జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కాకినాడ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండవ విడత సమావేశం కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2026-2027 ద్వైవార్షిక కాలానికి మీడియా సంస్థలు నుంచి అందిన 311 దరఖాస్తులను పరిశీలించిన అర్హులైన 252 మందికి అక్రిడిటేషన్ల జారీకి ఆమోదించామని తెలిపారు. అర్హతలు సమర్పించలేక పోయిన 59 దరఖాస్తులను డిఫర్ చేసినట్టు వెల్లడించారు. జనవరి 29న జరిగిన కమిటీ తొలి సమావేశంలో 237 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయగా, మంగళవారం జరిగిన రెండవ సమావేశంలో కమిటీ మరో 252 మందికి అక్రిడిటేషన్లను ఆమోదించిందని కలెక్టర్ వెల్లడించారు. రెండు విడతల్లో మొత్తం 489 మందికి అక్రిడిటేషన్లు ఆమోదించామన్నారు.

జిల్లా ప్రగతికి జర్నలిస్టులు కృషి చేయాలి

జర్నలిస్ట్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లాలో అర్హులైన వారందరికీ సమగ్రంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. సమాజాభివృద్ది, జిల్లా ప్రగతి కొరకు జర్నలిస్టులు తమ వంతు భూమికను నిబద్దతో చైతన్యవంతంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ మెంబర్ కన్వీనర్, డీఐపీఆర్ఓ ఆర్.వి.ఎస్.రామచంద్రరావు, ఎక్స్ అఫిషియో సభ్యులు, డీఆర్ఓ టి. తిప్పే నాయక్ , కమిటీ సభ్యులు ఎస్.శివన్నారాయణ రెడ్డి, ఎంఎన్. లక్ష్మణ్, జి.శోభన్ నవీన్ రాజ్ బాబు, వి.సాయినాథ్, కె.శ్రీనివాసరావు, టి.పల్లవరాజు, ఎస్.త్రిమూర్తులు, యం.కామేశ్వరరావు, పి.రాంబాబు, ఎన్.కె.దుర్రానీ, సీహెచ్.రాజారమేష్, సమాచార శాఖ ఏఈఐఈ సి.బాబూరావు, వైద్యఆరోగ్య, హౌసింగ్, ఆర్టీసీ, రైల్వే, కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story