పండగ వేళ.. ఏరులైపారిన మద్యం

by Thanuru Gopichand |

పండగ వేళ పీపాలు పీపాలు మందు తాగేశారు.

పండగ వేళ.. ఏరులైపారిన మద్యం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో (Andhra Pradesh) సంక్రాంతి (Sankranti) పండుగ వేళ మద్యం అమ్మకాలు (Liquor Sales) సరికొత్త రికార్డులను సృష్టించాయి. పండుగ సంబరాలు, కోడిపందేల జోరుతో రాష్ట్రవ్యాప్తంగా మందుబాబులు రికార్డు స్థాయిలో మద్యాన్ని తాగేశారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఏపీలో ఏకంగా రూ. 877 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు రూ. 85 కోట్ల వరకు విక్రయాలు జరుగుతుండగా, పండుగ సీజన్‌లో ఈ అమ్మకాలు రెట్టింపవ్వడం గమనార్హం.

ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరిగిన మూడు రోజుల్లోనే మద్యం ఏరులై పారింది. ఈ మూడు రోజుల్లోనే సుమారు రూ. 438 కోట్ల విలువైన లిక్కర్ విక్రయాలు జరిగాయి. పల్లెల్లో సంక్రాంతి సందడికి తోడు, పట్టణాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు తరలిరావడంతో మద్యం దుకాణాల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కోడిపందేల బరుల సమీపంలో ఉన్న వైన్ షాపులు కిక్కిరిసిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం రాకుండా ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం కూడా స్థానిక అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా నిలిచింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలను సీసాకు రూ. 10 చొప్పున పెంచినప్పటికీ, అమ్మకాలపై దాని ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. కొత్త ఏడాది (New Year) వేళ డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు జరిగిన రూ. 543 కోట్ల విక్రయాల రికార్డును పక్కన పెడితే, ఇప్పుడు సంక్రాంతి వారంలో నమోదైన రూ. 877 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. పండుగ విందులు, వినోదాల్లో భాగంగా మందుబాబులు చేసిన ఖర్చుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధిని కనబరుస్తోంది.

Next Story