విశాఖలో మళ్ళీ డ్రగ్స్ కలకలం

by Thanuru Gopichand |

మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న విశాఖ యువత.

విశాఖలో మళ్ళీ డ్రగ్స్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలో (Visakapatnam) మరోసారి డ్రగ్స్ (Drugs) పట్టుబడడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా.. వారి వద్ద మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి. దీంతో మరోసారి నగరంలో ఆందోళనలు మొదలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం ఎంవీపీ సెక్టార్ లో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘాను ఉంచారు. నిందితులు డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో వారిని పట్టుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో వినయ్, సాయి, శ్యామ్ అనే వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 4.5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వినయ్ బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గత జూలైలో..

విశాఖపట్నంలో కొకైన్ తరలిస్తున్న ఇద్దరు నిందితులను విశాఖపట్నం మూడో పట్టణ పోలీసులు జూలైలో అరెస్టు చేశారు. నిందితులను సీతమ్మధార ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్, దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ గా పోలీసులు గుర్తించారు. వారి నుంచి 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ తోపాటు అతడి స్నేహితులు రఘు, కృష్ణ చైతన్య, గౌతం కలిసి డ్రగ్స్ సేవించేందుకు దిల్లీకి చెందిన ప్రిన్సీ అనే వ్యక్తి ద్వారా ఆర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

నవంబరులో..

ఈగల్ టీం.. విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు నవంబరులో నిర్వహించిన తనిఖీల్లో డ్రగ్స్ లభించాయి. ఈ ఆపరేషనులో చరణ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 36 ఎల్ఎస్డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.

Next Story