నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు!

by Thanuru Gopichand |

ఆంధ్రప్రదేశ్​ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో (Nandikotkur) డ్రగ్స్ ముఠా పట్టుబడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

నందికొట్కూరులో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టు రట్టు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్​ లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో (Nandikotkur) డ్రగ్స్ ముఠా పట్టుబడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నందికొట్కూరులోని ఓ భవనం డ్రగ్స్ తయారు (Drugs Production) చేస్తున్న విషయాన్ని తెలంగాణ నార్కోటిక్ (Telangana Narcotics) విభాగం అధికారులు పసిగట్టారు. మంగళవారం ఆ భవనంలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అక్కడ డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు వెల్లడవ్వడంతో నందికొట్కూరువాసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందులో ఓ ఎంబీఏ విద్యార్థి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో మరింత ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం నందికొట్కూలోని ఓ ప్రైవేటు కాలేజీ ఎదురుగా ఒక సెలూన్ ఉంది. దాని పై అంతస్తులో కర్నూలులోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థి కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్స్ బృందం మంగళవారం అక్కడకు చేరుకుంది. అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించింది. భారీ ఎత్తున డ్రగ్స్ తయారీకి వినియోగించే రసాయనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుంది. తయారీ ముఠాలో విద్యార్థి మధు సూత్రధారిగా ఉన్నట్లు నార్కోటిక్ అధికారులు భావిస్తున్నారు. ముఠాలో స్థానికులతో పాటు బయటి వ్యక్తుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుమానితుడిగా భావిస్తున్న విద్యార్థితో పాటు అతని తండ్రిని కూడా నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా కీలక ఆధారాలను నార్కోటిక్ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.

అయితే డ్రగ్స్ తయారీ వెనుక అంతర్ రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. విద్యార్థికి హైదరాబాద్ ముఠాతో సంబంధం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రతి నెల హైదరాబాద్ కు చెందిన ఐదుగురు నందికొట్కూరుకు రాకపోకలు సాగిస్తున్నట్లు నార్కోటిక్ అధికారులు గుర్తించారని పోలీసులు పేర్కొంటున్నారు. డ్రగ్స్ ను తయారు చేసి అనంతరం ఇంజక్షన్ రూపంలో వాటిని నెట్వర్క్ ద్వారా విక్రయిస్తారని అధికారులు చెబుతున్నారు. ముఠాకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక గ్యాంగులతో సంబంధం ఉండొచ్చని.. ఆ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story