డయేరియాపై ఆందోళన వద్దు.. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది : కేంద్రమంత్రి

by Naga Rani Yarlagadda |

డయేరియాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రస్తుతం కంట్రోల్ లో ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

డయేరియాపై ఆందోళన వద్దు.. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మూడురోజుల క్రితం శ్రీకాకుళంలో డయేరియా ప్రబలిన విషయం తెలిసిందే. తాగునీరు కలుషితం కావడంతో.. సుమారు 74 మంది ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గురువారం ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు. అతిసార వ్యాధితో మరణించిన సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేతో సమావేశమై.. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. శ్రీకాకుళం ప్రాంతంలో డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టిందని కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నవారు కూడా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. డయేరియా ప్రస్తుతం కంట్రోల్లోకి వచ్చిందని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే ప్రభావిత ప్రాంతాలతో పాటు.. శ్రీకాకుళమంతా మెరుగైన తాగునీటి సదుపాయాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి కల్తీపాట ఘటనలో మొత్తంగా ఆరుగురు మరణించగా.. పరిస్థితులను అర్థం చేసుకోకుండా వైసీపీ నాయకులకు శవాలతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది విమర్శించారు.

Next Story