- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళంలో డయేరియా కలకలం.. 24 గంటల్లో 19 మందికి అస్వస్థత..
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 19 మంది బాధితులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. గడిచిన 24 గంటల్లోనే నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 19 మంది బాధితులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ముఖ్యంగా కాకి వీధి, దమ్మల వీధి, గుడి వీధి, మంగువారి తోట వంటి ప్రాంతాల్లో ఈ కేసులు అధికంగా నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు. డయేరియా ప్రబలడానికి కారణం కలుషిత నీరేనని అనుమానిస్తున్న తరుణంలో, వైద్య సిబ్బంది ఆయా వీధుల్లోని నీటి నమూనాలను (Water Samples) సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. ‘ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే ముందుజాగ్రత్తగా నీటిని బాగా మరిగించి, చల్లార్చిన తర్వాతే తాగాలి’ అని కలెక్టర్ ప్రజలకు సూచించారు.
స్పందించిన మంత్రి నారాయణ..
శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తిపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌ఓ (DMHO), నగరపాలక సంస్థ కమిషనర్‌తో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడి తాజా పరిస్థితిని సమీక్షించారు. పైపులైన్ల లీకేజీ వల్ల నీరు కలుషితమైందా? లేదా ఆహారపు అలవాట్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా? అనే కోణంలో సమగ్ర విచారణ జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.






