శ్రీశైలంలో భక్తులకు తప్పిన ప్రమాదం.. VIP కాటేజీలో చెలరేగిన మంటలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-22 02:03:56  IST  )

శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని వీఐపీ కాటేజీలో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగగా, భక్తులు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

శ్రీశైలంలో భక్తులకు తప్పిన ప్రమాదం.. VIP కాటేజీలో చెలరేగిన మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam)లో భక్తులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. భక్తుల బస కోసం కేటాయించిన ఓ వీఐపీ కాటేజీలో ఇవాళ ప్రమాదం సంభవించింది. గదిలోని ఏసీ (Air Conditioner)లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఏసీ నుంచి దట్టమైన పొగలు రావడంతో పాటు, క్షణాల్లోనే గది అంతా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో కాటేజీలో భక్తులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు తీవ్ర ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. ఇతర గదుల్లో ఉన్న వారు కూడా ప్రాణ భయంతో కాటేజీ వెలుపలికి చేరుకున్నారు.

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది (Fire fighters)ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ఇతర గదులకు విస్తరించకుండా నివారించగలిగారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏసీ(AC)లో లోడ్ పెరగడం వల్ల లేదా వైరింగ్ లోని లోపాల వల్ల ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దేవస్థానం అధికారులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

Next Story