తొలిసారి ఈ ఆలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-30 13:20:09  IST  )

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు...

తొలిసారి ఈ ఆలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్.. పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లింపు
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలంచిన విషయం తెలిసిందే.అయితే తిరుగు ప్రయాణంలో మోపిదేవిలో సుబ్రహ్మణ్య క్షేత్రం శ్రీవల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. తొలిసారి ఈ ఆలయానికి వెళ్లిన పవన్ కల్యాణ్‌కు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కి... ఆలయ ఆవరణలో ఉన్న నాగ పుట్టను పవన్ కల్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. అనంతరం ప్రదక్షిణగా అంతరాలయంలోని వేయి పడగలతో లింగమూర్తిగా వెలసిన మూలవిరాట్టుకి పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ విశిష్టతను ఆసక్తిగా ఆలకించిన పవన్

పూజల అనంతరం ఘనాపాటి నవుడూరి విశ్వనాథ శర్మ ఆలయ విశిష్టతను, చరిత్రను పవన్‌కు వివరించారు. సుబ్రహ్మణ్వేశ్వర స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం అని, ఆలయం వెలుపల పుట్టలో పోసిన పాలను లింగాకార మూర్తి కింద సర్పరూపంలో ఉన్న స్వామి స్వీకరిస్తారని తెలిపారు. సంవత్సరానికి రెండు, మూడు సార్లు స్వామి వెలుపలికి వచ్చి భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారని వివరించారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా పేరున్న మోపిదేవి క్షేత్రానికి వారాంతాలు, ప్రతి మంగళవారాల్లో వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారని చెప్పారు.

నిఫా తుపాను సమయంలో రైతుల పరామర్శ సమయంలో ఆలయం వెలుపలి నుంచి వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తమిళనాట ఉన్న ఆరు విఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్వేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

Next Story