పదోన్నతుల్లో నాన్న జీవితమే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

పదోన్నతుల్లో తన తండ్రి జీవితమే స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు....

పదోన్నతుల్లో నాన్న జీవితమే నాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: పదోన్నతుల్లో తన తండ్రి జీవితమే స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. చిత్తూరు(Chittoor)లో డీడీవో కార్యాలయంతో పాటు, రాష్ట్రంలోని 77 డీడీవో ఆఫీసులను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తన తండ్రి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదగడానికి ఏళ్ల సమయం పట్టిందని తెలిపారు. పంచాయతీరాజ్ పరిధిలోనూ దశాబ్దాలుగా పదోన్నతులు లేవని, తన దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తి పారదర్శకతను పాటిస్తూ పదోన్నతులు కల్పించే బాధ్యతను తీసుకున్నానని తెలిపారు. సుమారు 10 వేల మందికి రాజకీయాలకు అతీతంగా, సిఫార్సులు, ఒత్తిళ్లు లేకుండా పదోన్నతులు కల్పించామని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పని చేసే అధికారుల పదోన్నతులకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయన్నారు. వీఏవోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారు వి.ఏ.ఒ.గానే రిటైర్ అయిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. గ్రూప్ -1 ద్వారా ఎంపిడివోగా నియమితులైన వారు ఏళ్ల తరబడి పదోన్నతి లేకుండా ఉండేవారన్నారు. సీనియారిటీ విషయాల్లో కోర్టు కేసులు ఉండి ఎటువంటి పదోన్నతికి నోచుకోక అధికారుల్లో నిర్లిప్తత ఉండేదని తెలిపారు. దీనిని పోగొట్టడానికి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని పవన్ కల్యాణ్ తెలిపారు.

మినీ కలెక్టరేట్లుగా డీడీవీ కార్యాలయాల్లో అన్ని రకాల సేవలు అందుతాయని పవన్ తెలిపారు. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించడం చాలా సులభం అవుతుందని ఆయన చెప్పారు. ‘‘కింది స్థాయిలో జరిగే అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రభుత్వం ఆదేశాలను త్వరితిగతిన క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో అధికారులు ప్రజలకు మధ్య మరింత దగ్గర సంబంధాలు ఏర్పడతాయి. ఇది పాలన పరంగానే ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Next Story